Viral news: ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 11 సార్లు కరోనా టీకా తీసుకున్న ఘనుడు.. ఆశ్చర్యపోయిన అధికారులు..
కొవిడ్ నియంత్రణ ప్రక్రియలో భాగంగా దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా చాలామంది ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్నారు. కాగా కొవిడ్ వ్యాక్సిన్లపై అపొహాల కారణంగా కొంత మంది టీకా తీసుకోడానికి వెనుకాడుతున్నారు.
కొవిడ్ నియంత్రణ ప్రక్రియలో భాగంగా దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా చాలామంది ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్నారు. కాగా కొవిడ్ వ్యాక్సిన్లపై అపొహాల కారణంగా కొంత మంది టీకా తీసుకోడానికి వెనుకాడుతున్నారు. వ్యాక్సిన్‌తో తమకు కొత్త ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాలు ఎదురవుతాయని వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌కు ఒక వ్యక్తి ఏకంగా 11 సార్లు వ్యాక్సిన్ తీసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అది కూడా 84 ఏళ్ల వయసులో. తాను ఏయే తేదీల్లో, ఏయే సమయానికి ఎక్కడ టీకా తీసుకున్నాడో ఆయన వివరంగా రాసి పెట్టుకోవడం గమనార్హం. ఇప్పుడీ విషయాన్ని కూడా ఆయనే బహిరంగంగా ప్రకటించాడు. కాగా ప్రస్తుతం ఈ ఘటన బిహార్ వైద్య ఆరోగ్య శాఖలో సంచలనం సృష్టిస్తోంది. వైద్యాధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు.
రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ.. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని మాధేపుర జిల్లా ఉదకిషన్‌గంజ్ సబ్ డివిజన్ పరిధిలోని ఒరై గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్ మండల్ (84) పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా బ్రహ్మదేవ్ మండల్ 13 ఫిబ్రవరి 2021న మొదటి డోసు తీసుకున్నారు. మార్చి 13 రెండో డోస్, మే 19న మూడో డోస్ , జూన్ 16 నాలుగో డోస్, జులై 24న ఐదో డోస్.. ఆ తర్వాత ఆగస్టు 31న ఆరో డోస్, సెప్టెంబరు 11న ఏడో డోస్.. అనంతరం పది రోజుల వ్యవధిలోనే సెప్టెంబరు 22న ఎనిమిదో డోస్ తీసుకున్నాడు. కాగా మరో రెండో రోజుల వ్యవధిలోనే 24న తొమ్మిదో డోస్ తీసుకున్నట్టు బ్రహ్మదేవ్ తెలిపాడు. ఆతర్వాత ఖగారియా, భాగల్పూర్ జిల్లాల్లో వరుసగా 10, 11వ డోస్‌లు తీసుకున్నాడు.
అందుకే 11 డోసులు తీసుకున్నా.. ఇలా దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ తాను 11సార్లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు వెల్లడించాడు బ్రహ్మాదేవ్ . టీకా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందువల్లే అన్నిసార్లు వేసుకున్నానని చెప్పారు. ఇటీవల12వ సారి వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినట్టు పేర్కొన్నాడు. అయితే అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగియడంతో 12వ డోసు వేసుకోలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా టీకా తీసుకున్న ప్రతిసారీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు మండల్ చెబుతున్నారు. ఈ అంశం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో జిల్లా వైద్యాధికారులు స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించింది.
Also Read:
Chinese Pigeon: దేశంలో పావురాళ్ల కలకలం.. ఏపీలోనూ అనుమానాస్పద పిజియోన్స్ గుర్తింపు..
India Corona Cases: భారత్‌లో శరవేగంగా కరోనా కేసులు.. తాజాగా 58 వేలకుపైగా పాజిటివ్ కేసులు