భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
నవంబర్ 13, 2026.. ఈ తేదీని గుర్తుపెట్టుకోండి.. ఎందుకంటే ఆ రోజుతో ఈ ప్రపంచం అంతమైపోతుందంటూ ఇంటర్నెట్ మొత్తం ఒకటే చర్చ. దాదాపు 60 ఏళ్ల క్రితం ఒక ప్రముఖ శాస్త్రవేత్త చెప్పిన జోస్యం ఇప్పుడు నిజం కాబోతుందంటూ ప్రచారాలు హోరెత్తుతున్నాయి. AI విషయంలో ఆయన చెప్పిందే నిజమైతే.. ఈ ప్రళయం కూడా నిజమేనా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మరి కొద్ది రోజుల్లో ప్రపంచం అంతం కాబోతుందా..? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పాత పరిశోధనా నివేదిక నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇది కాస్త చాలా మంది ఆందోళనకు దారితీసింది. ప్రపంచ వినాశనం.. సరిగ్గా 2026 నవంబర్ 13 నాటికి భూమిపై మానవ మనుగడ సంక్షోభంలో పడుతుందని, ప్రపంచం తీవ్ర విపత్తును ఎదుర్కొంటుందని 1960లో సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక గణిత నమూనాను ప్రస్తావిస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆరు దశాబ్దాల క్రితం వెలువడిన ఒక పరిశోధనా పత్రం ఆధారంగా సాగుతున్న ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు వాస్తవాలేమిటో సమగ్ర పరిశీలన.
1960 నాటి పరిశోధన ఏమిటి? ఎవరు చేశారు?
ఈ చర్చకు మూలం 1960లో ప్రఖ్యాత సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక పరిశోధనా వ్యాసం. అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ సైబర్నెటిక్స్ శాస్త్రవేత్త హైన్జ్ వాన్ ఫోర్స్టర్, ప్యాట్రిసియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూలతో కలిసి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. 1960ల కాలంలో ప్రపంచ జనాభా కేవలం 300 కోట్లు మాత్రమే. అప్పట్లో పశ్చిమ దేశాల్లో నమోదవుతున్న జనాభా పెరుగుదల ధోరణులను, చారిత్రక గణాంకాలను పరిశీలించిన పరిశోధకులు భవిష్యత్తు కోసం ఒక గణిత నమూనాను సిద్ధం చేశారు. జనాభా పెరుగుదల రేటు ఏమాత్రం తగ్గకుండా నిరంతరం అదే వేగంతో విస్తరిస్తూ పోతే, 2026 నవంబర్ 13 నాటికి మానవ జనాభా గణిత పరిభాషలో అనంత స్థాయికి చేరుకుంటుందని వారు లెక్కగట్టారు. అంటే భూమి తన సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయి, వనరుల కొరతతో తీవ్ర సంక్షోభం తలెత్తుతుందని ఒక హెచ్చరికగా వెల్లడించారు.
ఏఐ హెచ్చరికలతో లింక్ చేస్తున్న నెటిజన్లు
ఈ పాత సిద్ధాంతం ఇప్పుడు ఇంతగా వైరల్ కావడానికి మరొక బలమైన కారణం ఉంది. హైన్జ్ వాన్ ఫోర్స్టర్ ఏఐ రంగంలో కీలక శాస్త్రవేత్త. వాన్ ఫోర్స్టర్ 1995లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో AI సామర్థ్యాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఒక కంప్యూటర్ నిర్దిష్ట పనిని చేయగలగడం వేరు, ఆ విషయాన్ని మానసికంగా అర్థం చేసుకోవడం వేరు. యంత్రాలు మనుషుల్లా ఆలోచిస్తాయని భావించడం పెను ప్రమాదకరం’’ అని రోబోల ఉదాహరణతో స్పష్టం చేశారు. ప్రస్తుతం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, చాట్‌బాట్‌లతో మనుషులు సంభాషిస్తూ, వాటితో భావోద్వేగ అనుబంధాలు ఏర్పరుచుకుంటున్న తరుణంలో ఫోర్స్టర్ చెప్పిన ఏఐ హెచ్చరికలు అక్షరాలా నిజమయ్యాయి. దాంతో AI గురించి ఆయన చెప్పిన మాట నిజమైనప్పుడు, 2026 నాటి జనాభా విపత్తు జోస్యం కూడా నిజం కావచ్చు కదా? అనే భావన నెటిజన్లలో బలపడింది.
శాస్త్రీయ వాస్తవం ఏమిటి?
ఈ ప్రచారంలో ఎలాంటి శాస్త్రీయ వాస్తవికత లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 1960ల నాటి సమీకరణం కేవలం జనాభా వృద్ధి రేటు ఎప్పటికీ తగ్గదు అనే ఊహాజనిత సిద్ధాంతంపై ఆధారపడింది. విద్య, వైద్య రంగాల విస్తరణ, పట్టణీకరణ, మహిళా సాధికారత కారణంగా ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు 8.3 బిలియన్లు మాత్రమే. ఈ శతాబ్దం చివరి నాటికి జనాభా గరిష్ట స్థాయికి చేరి, ఆపై క్రమంగా స్థిరీకరణ చెందుతుందని ఐక్యరాజ్యసమితి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు నిజం ఏంటీ..?
అసలు ఆ పరిశోధనా పత్రం భూమి అంతం అవుతుందని చెప్పలేదు. అనియంత్రిత జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలను హెచ్చరించడానికి రూపొందించిన ఒక గణిత ప్రయోగం మాత్రమే. శాస్త్రీయంగా ఆ అంచనాలు ఎప్పుడో తప్పని రుజువయ్యాయి కాబట్టి, నవంబర్ 13న ప్రపంచ వినాశనం జరుగుతుందనే ప్రచారాలు కేవలం ఆధారాల్లేని వదంతులేనని స్పష్టమవుతుంది.
