AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Jap T20:  భారత్ – జపాన్ చారిత్రక టీ20 మ్యాచ్‌కు తుఫాన్ గండం.. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా?

Ind vs Jap T20: భారత్, జపాన్ తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగాల్సిన ఈ చారిత్రక మ్యాచ్‌పై వాతావరణ పరిస్థితుల ప్రభావం కనిపిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధంగా ఉండగా, వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Ind vs Jap T20:  భారత్ - జపాన్ చారిత్రక టీ20 మ్యాచ్‌కు తుఫాన్ గండం.. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా?
India Vs Japan T20
Rakesh
|

Updated on: Sep 21, 2026 | 5:51 PM

Share

Ind vs Jap T20:  క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా నిలవాల్సిన భారత్, జపాన్ దేశాల మధ్య తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు తీవ్రమైన వాతావరణ ముప్పు పొంచి ఉంది. భారత్ – జపాన్ దౌత్య సంబంధాల 75 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మ్యాచ్ జరిగే ప్రాంతంలో టైపూన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అసలు ఒక్క బంతి కూడా పడుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వర్షం లేదా తుఫాన్ కారణంగా మ్యాచ్ రద్దయినప్పటికీ, ఈ మ్యాచ్ ద్వారా జపాన్‌లో క్రికెట్‌కు లభిస్తున్న గుర్తింపు చాలా గొప్ప విషయమని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

జపాన్‌లో క్రికెట్ అభివృద్ధిపై అసలు చర్చ

బేస్‌బాల్‌ క్రీడకు విపరీతమైన ఆదరణ ఉన్న జపాన్‌లో, క్రికెట్‌ను ఆదరణ తీసుకు వచ్చేందుకు ఆ దేశ క్రికెట్ సంఘం ఎంతో శ్రమిస్తోంది. ఈ మ్యాచ్‌ గురించి జపాన్ క్రికెట్ అసోసియేషన్ సీఓవో మాట్లాడుతూ.. తాము ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకున్నారు. భారత వంటి ప్రపంచ ఛాంపియన్ జట్టు తమ దేశానికి వచ్చి ఆడటం వల్ల జపాన్ మీడియాలో, ప్రజల్లో క్రికెట్ పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. జపాన్ జాతీయ జట్టులో ఎక్కువ మంది స్థానిక ఆటగాళ్లే ఉండటం విశేషం. జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ మాట్లాడుతూ, తాము కేవలం వేడుక కోసం మాత్రమే కాకుండా, జపాన్ పురుషుల జట్టు సత్తా ఏంటో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

భారత జట్టు సన్నాహాలు

శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పూర్తి స్థాయి భారత జట్టు ఇప్పటికే జపాన్‌ చేరుకుంది. సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్ కోసం సన్నాహాల్లో భాగంగా ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రపంచం మొత్తం దృష్టి ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే నిలిచింది. భారత జట్టులో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ కోసం ఇటు అభిమానులు, అటు ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాతావరణ పరిస్థితులు, తుది జట్లు

సానో ప్రాంతం టోక్యోకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. తుఫాన్ హెచ్చరికల కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, విప్రాజ్ నిగమ్, వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. జపాన్ జట్టు కూడా కెప్టెన్ కెండెల్ నేతృత్వంలో బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us