Sharmila Hunger Strike: ఇందిరా పార్క్ నుంచి లోటస్ పౌండ్‌కు మారిన వేదిక.. రెండోరోజు కొనసాగిన వైఎస్ షర్మిల నిరాహార దీక్ష

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయాలనే డిమాండ్‌తో దీక్షకు దిగారు వైఎస్‌ షర్మిల.

Sharmila Hunger Strike: ఇందిరా పార్క్ నుంచి లోటస్ పౌండ్‌కు మారిన వేదిక.. రెండోరోజు కొనసాగిన వైఎస్ షర్మిల నిరాహార దీక్ష
Ys Sharmila Hunger Strike For Unemployes
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 16, 2021 | 9:34 PM

YS Sharmila Udyogula deeksha:  తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయాలనే డిమాండ్‌తో దీక్షకు దిగారు వైఎస్‌ షర్మిల. ఉద్యోగాల భర్తీ కోసం ఆమె చేపట్టిన నిరాహార దీక్ష రెండు రోజులు పూర్తైంది. లోటస్‌పాండ్‌లో దీక్ష చేస్తున్న షర్మిలకు వైఎస్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చిన మద్దతు ప్రకటించారు.

ఉద్యోగాల భర్తీకోసం ఉద్యమించిన షర్మిల నిరాహార దీక్షకు ప్రజా సంఘాలు, విద్యార్ధులు మద్దతు ప్రకటించాయి. నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలోనే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. రెండో రోజు ఉదయం ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. మణికట్టు దగ్గర అయిన గాయానికి కట్టు కట్టారు. దీక్షా శిబిరంలో షర్మిలతో పాటు మిగతా అనుచరులంతా చేతికి నల్ల గుడ్డ కట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్‌ చేశారు. షర్మిల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లోటస్‌పాండ్‌లో షర్మిల దీక్షా శిబిరం వద్దకు సీనియర్ నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91,100 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ విడుదల చేయాలని షర్మిల అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా అరెస్ట్ చేసిన నిరుద్యోగుల, యువతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం షర్మిల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించారు. బీపీ టెస్ట్ చేయడంతో పాటు చేతికైన గాయాన్ని పరిశీలించారు. ఆమెకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గినట్లు తేలింది. షర్మిల 72 గంటల దీక్ష శనివారం సాయంత్రంతో ముగియనుంది.

ఇదిలావుంటే, వైఎస్ షర్మిల మూడు రోజులు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఇందిరాపార్క్ దగ్గర నిరాహార దీక్ష చేసేందుకు పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో.. మిగతా రెండు రోజుల పాటు లోటస్‌పాండ్‌లోని తన ఇంట్లోనే దీక్ష చేయాలని షర్మిల నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం రెండవరోజు నిరాహార దీక్షను షర్మిల ఇంట్లోనే చేపట్టారు. కాగా, నిన్న ఇందిరాపార్క్ వద్ద షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. అనుమతి ఇచ్చిన సమయం ముగిసిన తర్వాత కూడా షర్మిల దీక్ష చేస్తుండటంతో.. పోలీసులు దీక్షను భగ్నం చేశారు. దీనికి నిరసనగా షర్మిల లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా వెళ్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

Read Also…  తిరుపతి ఉప ఎన్నిక అసల అంకానికి అంతా సిద్ధం… కరోనా నిబంధనల నడుమ పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు