
యువత అత్యాశకు పోయి గొంతెమ్మ కోరికలు కోరి తల్లిదండ్రులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చివరికి ఆ కోరికలు నెరవేరకపోవడంతో ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. ఉన్న ఒక్క జీవితాన్ని ఎలాంటి ఆలోచన లేకుండా వదిలేస్తున్నారు. చిన్నచిన్న వాటికి యువత ఆత్మహత్య చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇక తాము ఏమి పని చేయకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపాలని గుంతెమ్మ కోరికలు కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని మనస్తాపం చెందిన యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య కుమారుడు జానీ(21) తనకు బీఎండబ్ల్యూ కారు కొనివ్వాలని ఇంట్లో వారిని ఇబ్బందులు పెట్టాడు. కొనివ్వకపోతే చనిపోతానని తరచూ ఇంట్లోని వారితో గొడవ పడేవాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా.. కారు కొనివ్వాల్సిందేనని మొండికేశాడు. కొడుకు మొండితనాన్ని భరించలేని తండ్రి లోన్ తీసుకుని శుక్రవారం సిద్ధిపేట కారు షోరూంకు వెళ్లి మారుతి స్విఫ్ట్ డిజైర్ కొనిస్తామని తండ్రి చెప్పాడు. కానీ ఆ కారు జానీ నచ్చలేదని.. తనకు నచ్చిన బీఎండబ్ల్యూ కారు కొనివ్వాలని డిమాండ్ చేశాడు. ఇక బీఎండబ్ల్యూ కారు కొనివ్వడం తమ వల్ల కాదని తల్లిదండ్రులు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు జానీ.
శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. అది గమనించిన కుటుంబసభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా శనివారం రాత్రి పరిస్థితి విషమించి జానీ మృతి చెందాడు. జానీ తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం ఇందులో జానీ చిన్నవాడు. జానీ కుటుంబ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. వీరికి సొంతంగా 30 గుంటల భూమి ఉండగా, ఇటీవల కుక్కునూరుపల్లి వద్ద నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని అందులో పంట వేశారు. ఆ పంట చేతికి రాగానే జానీ తనకు కారు కొనివ్వాలని ముందుకు వేశాడు. మృతుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి