బషీరాబాద్, ఆగస్టు 26: ఓ మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా హఠాత్తుగా గూడ్స్ రైలు దూసుకొచ్చింది. అయితే మహిళ సమయ స్పూర్తితో వ్యవహరించిన విధానం ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవాంద్గీ రైల్వేస్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా బహీరాబాద్‌లోని నవాంద్గీ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు చివరలో కింద నుంచి ఆటువైపుగా దాటి వెళ్లేందుకు ఓ గుర్తు తెలియని మహిళ ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో ఆ రైలు అకస్మాత్తుగా కదిలింది. తొలుత కొంత కంగారు పడినా.. ఆ తర్వాత ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ రైలు కింద పట్టాల మధ్యన తల వంచి అలాగే పడుకుని పోయింది. ఆమెను గమనించిన అక్కడే ఉన్న స్థానిక యువకుడు రైలుకిందకు వెళ్లిన మహిళతో మధ్యలో కింద పడుకోమని చెప్పి, ఈ మొత్తం దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. రైలు వెళ్లేవరకు మహిళ ఆలాగే ఉండింది. రైలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ మహిళ పైకిలేచి మెళ్లగా అవతలికి రావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
సమయస్ఫూర్తితో ధైర్యంగా పట్టాల మధ్యలో పడుకుని ప్రాణాలు దక్కించుకుంది. రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ మహిళ.. రైలు వెళ్లాక భయంతో అక్కడి నుంచి పరుగున వెళ్లిపోయింది. ఈ సంఘటనను అక్కడున్న కొందరు యువకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయమై సమాచారం అందలేదని స్టేషన్ మాస్టర్ మీడియాకు చెప్పాడు. గూడ్స్ రైలు పరుగు పెడుతుండగా పట్టాల కిందనే పడుకొని, రైలు వెళ్లాక లేచి వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తుంది. కాగా కదిలే రైలు కింద కదలకుండా పడుకోవడమంటే మాటలు కాదు. చెవులు బద్దలయ్యే రైలు చక్రాల చప్పుళ్లు, ఏ మాత్రం కదిలిన రైలు చక్రాల కింద నుజ్జు కావడం ఖాయం. అయితే ఆ మహిళ పట్టాలపై బోర్లా పడుకుని, ఆఖరి పెట్టె వెళ్లేంతవరకూ తన ప్రాణాలను ఉగ్గపట్టుకుని పడుకుంది. ప్రమాద సమయంలో ధైర్యం, సమయస్ఫూర్తి ఉంటేనే ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడగలం. ఆ సమయంలో ఆమెకు వచ్చిన ఆలోచనను అందరూ ప్రసంశిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.