మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం ఫతేపూర్ మైసమ్మ ఆలయం వద్ద జరిగింది. కూచూర్ గ్రామానికి చెందిన 60 ఏళ్ల మంగళి చిన్నమ్మ బంధువులు బుధవారం మైసమ్మ ఆలయం వద్ద దావత్ నిర్వహించారు. దీంతో చిన్నమ్మ భోజనం చేస్తుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. ఈ క్రమంలో అస్వస్థతకు గురై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నమ్మ అన్న తింటుండగా.. ఆమె గొంతులో మటన్ ముక్క ఇరుక్కుందని.. దీంతో ఊపిరాడక ప్రాణాలు విడిచిందని కచూర్ గ్రామస్థులు తెలిపారు.
మొన్నటికి మొన్న, వరంగల్‌లో ఓచిన్నారి చాక్లెట్ ఇరుక్కుని చనిపోయాడు. రాజస్థాన్‌కు చెందిన కన్‌గహాన్‌సింగ్ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలసొచ్చాడు. జేపీఎన్ రోడ్డులో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. వ్యాపార పనుల్లో భాగంగా ఈ మధ్యే ఆస్ట్రేలియా వెళ్లిన కన్‌గహాన్.. వస్తూవస్తూ పిల్లల కోసం అక్కడి నుంచి చాక్లెట్లు తెచ్చాడు. రెండో తరగతి చదువుతున్న అతని రెండో కొడుకు సందీప్.. నాన్న తెచ్చిన ఫారిన్ చాక్లెట్స్‌ను తీసుకుని స్కూలుకెళ్లాడు..చాక్లెట్ నోట్లో వేసుకొని ఫస్ట్‌ఫ్లోర్‌లోని తన క్లాస్‌కు వెళ్లిన కొద్దిసేపటికే.. స్పృహ తప్పి పడిపోయాడు. గొంతులో ఇరుక్కున్న చాక్లెట్టే.. సందీప్ ప్రాణాలు తీసింది.
అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పళ్లు విరుగుతాయని పెద్దలు చెప్పకనే చెప్పారు..సూర్యాపేట జిల్లాలోని రాజానాయక్ తండాకు చెందిన భూక్య గోపి కుటుంబం ముత్యాలమ్మ అమ్మవారిని ఇంటి దేవతగా కొలుస్తుంటారు. ముత్యాలమ్మకు జాతర చేసి మేకను బలిచ్చారు. యాట మాంసంతో రుచికరంగా వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం బంధువులతో కలిసి ఇంటిల్లిపాది కూర్చుని సంతోషంగా భోజనాలు చేశారు. అదే సమయంలో భూక్య గోపి గొంతులో మాంసం ఎముక ఇరుక్కుపోయింది. అది లోపలికి వెళ్లక.. బయటికి రాకపోవడంతో గోపి నరకం అనుభవించాడు. కుటుంబసభ్యులు, స్థానికులు ఎన్ని టెక్నిక్‌లు ఉపయోగించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినా ఎముకను బయటకు తీయలేకపోయారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన గోపి చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ లోని చిక్కడపల్లి పరిధిలో గతంలో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. చిక్కడపల్లి లోని అశోక్‌నగర్ లో వాచ్‌మెన్‌గా పనిచేసే కుమారస్వామి ఇంటికి రాగానే చికెన్‌తో చపాతి తినేసమయంలో..చికెన్ ముక్క అతడి గొంతుకు అడ్డం పడింది. చాలా ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చికెన్ ముక్కను బయటకు తీశారు. కానీ.. అప్పటికే పరిస్థితి విషమించింది. కుమారస్వామి చనిపోయాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..