గ్రేటర్ దంగల్ : బీజేపీ బల్దియా ఎన్నికలను ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..?

|

Nov 29, 2020 | 12:32 PM

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నుంచి ఇద్దరు మాత్రమే (రఘునందర్ రావుతో కలిపి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

గ్రేటర్ దంగల్ : బీజేపీ బల్దియా ఎన్నికలను ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..?
Follow us on

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నుంచి ఇద్దరు మాత్రమే (రఘునందర్ రావుతో కలిపి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన కాషాయ దళం17 స్థానాల్లో 4 చోట్ల విజయం సాధించింది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి..మంచి బూస్ట్ అందుకుంది. అదే ఉత్సాహంతో మున్సిపల్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడానికి అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకుంది. ఎందుకంటే కమలం పార్టీ అగ్ర నేతలు బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగమవుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు స్మృతీ ఇరానీ, ప్రకాశ్‌ జావ్‌దేకర్‌ కూడా రంగంలోకి దిగారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తమ పాత్ర పోషిస్తున్నారు. ఇక బిహార్‌లో పార్టీ విజయానికి కీలకంగా పనిచేసిన సీనియర్‌ నేత భూపేంద్ర యాదవ్‌కు బీజేపీ ఈ ఎన్నికల బాధ్యతను అప్పగించింది. అసలు ఎందుకు ఈ ఎన్నికలను బీజేపీ ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

దుబ్బాక ఇచ్చింది ఎంతో స్పూర్తి :

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చనిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే భార్యకే సీటు ఇచ్చింది. అక్కడ గెలవడం టీఆర్‌ఎస్‌కు చాలా అవసరం. ఎందుకంటే అది సీఎం నియోజకవర్గం పక్కనే ఉంటుంది. ఇక కింగ్ మేకర్‌గా పేరున్న హరీష్ రావు ఆ బాధ్యతలను మీదేసుకున్నారు. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 13.75 నుంచి 38.5కు పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ ఎంత పుంజుకుందో. దీంతో బీజేపీలో కొత్త ఆశలు చిగురించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా అధికార పార్టీపై విరుచుకుపడుతూ కార్యకర్తలకు బూస్ట్ ఇస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో ద్వారా దుబ్బాక గెలుపు గాలివాటం కాదని నిరూపించాలని బీజేపీ నాయకత్వం డిసైడయ్యింది. అంతేకాదు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలపాలన్నది వారి ఆలోచన. ఈ విషయంలో ఇప్పటికే సగం సక్సెస్ అయ్యారు కూడా. అసలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉందా అన్న డౌట్ వస్తుంది. ఆ పార్టీ నుంచి జాతీయ నాయకులలో ఒక్కరు కూడా ప్రచారానికి రాలేదు. ఇక బీజేపీ క్యాడర్‌ను గ్రామగ్రామాన నిలపాలన్నది వారి ఆలోచన. ఇక అధిక సంఖ్యలో ఉన్న నాయకులతో అధికార టీఆర్‌ఎస్‌ ఉన్న అసమ్మతిని కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు.

ఇటీవల వర్షాలు, వరదలు వల్ల హైదరాబాద్‌లో స్థానిక నాయకులపై మహిళలు ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారో చూశాం. దీన్ని తనకు అనువుగా మార్చుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ ఎన్నికల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రేనేజ్, విద్యుత్‌ గురించే చర్చ జరిగింది. కానీ తొలిసారి రోహింగ్యాలు, ముస్లింలు, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, సర్జికల్ స్ట్రైక్స్‌ గురించి డిస్కషన్ నడుస్తోంది. ఇవన్నీ బీజేపీకి అనుకూలించే అంశాలే. మొత్తానికి టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటును తమవైపుకు తిప్పుకోవడంలో బీజేపీ నేతలు సఫలీకృతం అవుతున్నట్లే కనిపిస్తున్నారు.

అమిత్ షా హైదరాబాద్ పర్యటన లైవ్ అప్‌డేట్స్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :