Itlu Mee Niyojakavargam: రాజాసింగ్‌కు హ్యాట్రిక్ దక్కనివ్వొద్దన్న కసితో బీఆర్‌ఎస్.. గోషామహల్ జనం జై కొడుతున్నది ఎవరికి..
ఏ టూ జడ్.. గుండు పిన్ను నుంచి మొదలుకొని అక్కడ దొరకని వస్తువంటూ లేదు.. ఆ నియోజకవర్గం స్పెషాలిటీ అది. హోల్ సెల్ వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్. గుడుంబా నుంచి డ్రగ్స్ దాకా అదే అడ్డ.. వినాయక విగ్రహాల నుంచి పతంగుల వరకు అన్నీ దొరుకుతాయి అక్కడ. అంతేకాదు.. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ,ఎంఐఎం, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయాలు ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి.రాష్ట్ర రాజధాని రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్న గోషామహల్ నియోజకవర్గం లో ఏమీ జరగుతుంది.
హైదరాబాద్ మహానగరానికి గుండెకాయలాంటిది గోషామహల్. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ జీవనం సాగించే ఈ ప్రాంతం ఒక మినీఇండియా అని చెప్పొచ్చు. అలాంటి గోషా మహల్‌లో రాజకీయాలు సైతం… అదే రేంజ్‌లో ఉంటాయి. గతంలో మహరాజ్ గంజ్‌గా ఉన్న నియోజకవర్గం… 2009 పునర్విభజనలో భాగంగా గోషామహల్‌గా రూపాంతరం చెందింది. అలాగే మెల్లమెల్లగా ఇక్కడి రాజకీయ పరిస్థితులూ మారుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2018 వరుస ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయం సాధించిన రాజాసింగ్… ఇక్కడి పాలిటిక్స్‌కు కేరాఫ్‌గా మారిపోయారు. కార్పొరేటర్‌గా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన రాజాసింగ్.. అనతికాలంలోనే లోకల్‌గా గ్రిప్పు సంపాదించారు. అందుకే, మంత్రి హోదాలో పనిచేసిన ముఖేశ్‌గౌడ్‌ను ఢీకొట్టి.. విజయం సాధించారు. అప్పట్లో పొలిటికల్‌గా సంచలనం రేపారు.
పేరుకు బీజేపీ ఎమ్మెల్యేనే అయినా.. హిందుత్వ అజెండాను తన సొంత ఎజెండా మార్చుకుని ముందుకు సాగే రాజాసింగ్… వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో .. ఒకరకంగా దేశవ్యాప్తంగా ఫేమస్సైపోయారు. అదే ఊపుతో.. మరోసారి విజయం సాధించే దిశగా.. తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే, ఇటీవల మునావర్ స్టాండప్ కామెడీ ఇష్యూలో… ఓ వీడియోను రూపొందించి… తీవ్రదుమారానికి కారణమైన రాజాసింగ్.. బీజేపీ నుంచి సస్పెండయ్యారు. దాన్ని ఎత్తేయాలని హైకమాండ్‌కు అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ.. దానిపై ఎటూ తేల్చని పరిస్థితి బీజేపీ పెద్దలది.
అప్పటికే, ఈ కేసులో పోలీసులు పీడీయాక్టు పెట్టి రాజాసింగ్ కొన్ని రోజుల పాటు జైల్లోనూ పెట్టారు. దీంతో వచ్చేసారి బీజేపీ తరపున పోటీచేసే అవకాశం వస్తుందా… ? లేక సొంత చరిష్మా ఏలాగూ ఉంది కాబట్టి… ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీ పరంగా గోషామహల్‌లో రాజాసింగే కింగని చెప్పొచ్చు. కానీ, సస్పెన్షన్‌పై అధినాయకత్వం తీసుకునే నిర్ణయం మీదే ఆయన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందనేది మాత్రం సుస్పష్టం.
ఆ తర్వాత ఆయనను వెంటాడిన పరాజయం
ఇప్పుడంతా గోషామహల్‌గా పిలుస్తున్న ఈ స్థానం.. గతంలో మహారాజ్‌గంజ్‌గా సుపరిచితం. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ ఇక్కణ్నుంచే విజయం సాధించారు. 2009లో గోషామహల్‌గా మారాక.. తొలి విక్టరీ కూడా ఆయనే నమోదు చేశారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, ఆ తర్వాత ఆయనను పరాజయం వెంటాడింది. 2014లో రెండోస్థానంలో నిలిచిన ముఖేశ్… 2018లో మరీ ఘోరంగా మూడో ప్లేసుతో సరిపెట్టుకున్నారు. అయితే, 2019లో ఆయన హఠాన్మరణంతో.. అక్కడ కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయింది. అయితే, తన జీవితం చివరిదాకా బీజేపీని రాజకీయ ప్రత్యర్థిగా ముఖేశ్ భావిస్తే.. ఆయన వారసుడు విక్రంగౌడ్… ఇప్పుడు అదే బీజేపీలో చేరారు. దీంతో, ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. మరి, వచ్చేసారి ఎవరు బరిలో ఉంటారు? ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అన్నదే కీలకంగా మారింది. తండ్రి వారసత్వం కొనసాగించాలని భావిస్తున్న విక్రంగౌడ్.. బీజేపీలో యాక్టివ్‌గా ఉంటూ పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే, రాజాసింగ్ మద్దతిస్తేనే పోటీలో ఉంటాననీ.. ఆయనే పోటీచేస్తానంటే మద్దతు తెలుపుతానని చెబుతున్నారు విక్రం.
గోషామహల్‌పై ఫోకస్ పెట్టిన బీఆర్‌ఎస్
వచ్చే ఎన్నికలకు సంబంధించి… గోషామహల్‌పై అన్ని రాజకీయ పక్షాలు గురిపెట్టాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఖాతా తెరవని బీఆర్‌ఎస్… ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో పనిచేస్తోంది. అయితే, గతంలో ఎంఐఎం పార్టీ సైతం ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో… ఇన్నాళ్లూ పోరు కాంగ్రెస్, బీజేపీ అన్నట్టుగానే సాగింది. ఇప్పుడు కాంగ్రెస్ నేత విక్రంగౌడ్ బీజేపీలో చేరిపోవడంతో.. హస్తానికి దిక్కులేకుండా పోయింది. దీంతో వార్ కాస్తా బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది.
రాజాసింగ్‌కు హ్యాట్రిక్ దక్కనివ్వొద్దన్న కసితో బీఆర్‌ఎస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి… బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినా విజయం కాస్తలో మిస్సయ్యింది. ఈసారి ఎంఐఎం మద్దతుతో బరిలో దిగి… గెలిచి తీరాలని పథకం రచిస్తున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ వేటేసిన వేళ… అదను చూసి రంగంలోకి దిగింది అధికార పార్టీ. రాజాసింగ్ ను హ్యాట్రిక్ కొట్టనివ్వొద్దనే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో రాజాసింగ్ గట్టి పోటీ ఇచ్చిన ప్రేమ్‌సింగ్ రాథోడ్… మరోసారి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో బీజేపీలో పనిచేసిన రాథోడ్… ఆ తర్వాత గులాబీ కండువా కప్పేసుకున్నారు. పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేస్తున్నారు.
రాజాసింగ్ అడ్డాలో అమాత్యుడు పాగా వేస్తారా?
గోషామహల్‌పై గురిపెట్టిన భారత రాష్ట్ర సమితి.. కీలక నేతలను రంగంలోకి దింపింది. అధిష్టానం ఆదేశాలతో.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ వార్‌లో… ఇక్కడి 5 డివిజన్లనూ గెలిచిన బీజేపీ బలంగా కనిపిస్తోంది. తాజా పరిణామాలతో.. రాజాసింగ్ చుట్టూ సెంటిమెంట్ గోడ మరింత గట్టిగా తయారైంది. దీంతో, ఈసారి గెలిచితీరాలన్న కసితో పనిచేస్తోంది గులాబీదళం. అభివృద్ధి కార్యక్రమాల్లో జోరు పెంచిన మంత్రి… స్థానిక క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి స్కెచ్ చూస్తుంటే.. వచ్చేసారి సనత్‌నగర్‌లో కుమారుణ్ని నిలబెట్టి తాను గోషామహల్ బరిలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో గెలిచిన మంత్రి తలసాని… ఈ దఫా హైదరాబాద్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి, ప్రస్తుత ఈక్వెషన్స్‌కు తలసాని లెక్కలు సరిపోతాయా ? లేదా ? అన్నదే ఆసక్తి రేపుతోంది.
ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదంటున్న కాంగ్రెస్
అవిభజిత నియోజకవర్గంతో కలిపితే.. మొత్తంగా ఐదుసార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో, ఇక్కడ తమ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని భావిస్తున్నారు హస్తం నేతలు. అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు లోకల్ లీడర్ మెట్టు సాయి .
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ జనసాంద్రత
గోషామహల్ అంటేనే.. ఇరుకురోడ్లు.. చిన్న సందులు. అలాంటి చోట డ్రైనేజీ వ్యవస్థే ప్రధాన సమస్య. . తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ జనసాంద్రత ఉన్న ఈ ప్రాంతంలో… మురుగునీటి నాలాపైనే వ్యాపారాలు నడుస్తుంటాయి. వ్యాపారులు అక్కడే మకాం పెట్టిన కారణంగా.. ఇటీవల నాలామీద కప్పు కూలిపోయింది. దీంతో ఎప్పుడు ఏ రోడ్డు కుంగుతుందోనన్న భయంతో బతుకీడుస్తున్నారు స్థానికులు.
గుడుంబాపై ఉక్కుపాదం.. మరి వాళ్లకు జీవనోపాధి?
ధూల్ పేటలో గుడుంబా తయారీపై… సర్కారు ఉక్కుపాదం మోపింది. కానీ, గుడుంబా తయారీ మీద ఆధారపడ్డ కుటుంబాలకు.. ప్రత్యామ్నాయం చూపడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలున్నాయి.
పీఓపీ నిషేధం ఓకే.. మరి కళాకారుల పరిస్థితేంటి?
గణేశ్ విగ్రహాలంటే గుర్తొచ్చేది దూల్ పేట. అయితే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిషేధించడంతో… వాటిని తయారు చేసేవారికి ఉపాధి కరువైంది. పర్యావరణ హిత విగ్రహాల తయారీకి అవసరమైన మట్టిని అందజేస్తే… తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు తయారీదారులు. కానీ, అటువంటి చర్యలేవీ కనిపించడం లేదు.
విపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందా?
అయితే, ప్రతిపక్ష ఎమ్మెల్యేను కాబట్టే.. తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్నది రాజాసింగ్ ఆరోపణ. ఎన్నో ప్రాజెక్టులు టెండర్ దాకా వచ్చినా… కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవంతో, పనులు జరగడం లేదంటున్నారు.
రాష్ట్రంలో ఎక్కువ కమర్షియల్ ట్యాక్సులు కట్టే ప్రాంతంగా గోషామహల్‌కు పేరుంది. పాన్ డబ్బాలు, గప్ చుప్‌లు మొదలు… కోట్ల రూపాయల వ్యాపారాలకు ఈ నియోజకవర్గం మహా ఫేమస్. అయితే, ఇక్కడి వ్యాపారులకు ప్రజాప్రతినిధుల నుంచి మామూళ్ల ఒత్తిళ్లు ఎక్కువైపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తగినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానిక వ్యాపారులు.
గోషామహల్‌లో హిందు,ముస్లిం ఫీలింగ్ ఎక్కువ
గోషామహల్‌లో హిందు, ముస్లిం ఫీలింగే.. పొలిటికల్‌గా లీడింగ్ ఫ్యాక్టర్ అనే అభిప్రాయం ఉంది. హిందుత్వ అజెండాతో ముందుకెళ్లడమే రాజాసింగ్ కు కలిసి వస్తోందన్న వాదనా లేకపోలేదు. హిందూ ఓట్లన్నీ ఔట్ అండ్ ఔట్‌గా రాజాసింగ్ వైపు మళ్లుతున్నాయన్నది లోకల్‌గా పొలిటికల్ విశ్లేషణ. ఎక్కువగా మార్వాడీలు ఉండే ఈ ప్రాంతంలో… మాస్ పాలిటిక్స్‌కు కేరాఫ్‌గా మారిపోయారు రాజాసింగ్. అయితే, లౌకిక వాదంతో ముందుకెళ్తున్న బీఆర్‌ఎస్.. అభివృద్ధి, సంక్షేమమే తమ అజెండా అంటోంది. మరి, వచ్చేసారైనా గోషామహల్ ఓటర్లు కారు పార్టీకి రూటిస్తారా? లేక పాత పాటే పాడుతారా? అన్నది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం