AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: టాప్ గేర్‌లో బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..? ఆయా పార్టీల క్యాడర్‌లో ఉత్కంఠ!

Telangana Election Politics: పోలింగ్‌ డేట్‌ వచ్చేయడంతో తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైపోయింది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నాయి. అయితే, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. అభ్యర్థుల ఎంపికలో రాజీపడకుండా అడుగులు వేస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది స్క్రీనింగ్ కమిటీ. గెలిచే సత్తా ఉన్న వారినే బరిలోకి దించేందుకు సమాయత్తమవుతోంది.

Telangana Politics: టాప్ గేర్‌లో బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..? ఆయా పార్టీల క్యాడర్‌లో ఉత్కంఠ!
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Oct 09, 2023 | 9:36 PM

Share

Telangana Election Politics: పోలింగ్‌ డేట్‌ వచ్చేయడంతో తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైపోయింది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నాయి. అయితే, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. అభ్యర్థుల ఎంపికలో రాజీపడకుండా అడుగులు వేస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది స్క్రీనింగ్ కమిటీ. గెలిచే సత్తా ఉన్న వారినే బరిలోకి దించేందుకు సమాయత్తమవుతోంది. పార్టీలోకి ఎప్పుడు వచ్చారన్నది కాకుండా.. ప్రత్యర్థులను చిత్తు చేయగలిగే వారుంటే బీఫాం ఇవ్వాలని భావిస్తోంది. సామాజిక అంశాలతోపాటు స్థానిక రాజకీయ పరిస్థితులు, సర్వేలు ఆధారం చేసుకుని పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతున్నట్లు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. గెలుపు గుర్రాలే ప్రామాణికంగా ముందుకెళ్లుతుండడంతో.. చివరి క్షణంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌ CEC సమావేశం తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండనుంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో రాజీపడకుండా అడుగులు వేస్తోందని.. అయితే, చివరి క్షణంలో కూడా మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మూడు విడతలలో అభ్యర్థుల జాబితా..

డబుల్‌ ఇంజన్‌ సర్కారు నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ. అభ్యర్ధుల ఎంపికపై ఆచూతూచి అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ సభలతో ఉత్సాహంగా ఉన్న కమల దళం.. అదే ఊపుతో అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ క్రమంలో 119అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతలలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది బిజెపి. లోక్‌సభ కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న క్రమంలో బిజెపిలోని ముఖ్య నేతలంతా బరిలో నిలవాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర నేతలు ఆ మేరకు సన్నద్దమవుతున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు బిఆర్‌ఎస్ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న చోట.. ముఖ్యమైన నేతలను బరిలోకి దించాలనే ఆలోచనలో అధినాయకత్వం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంపీలు, ముఖ్యనేతలు ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులు చేస్తున్న నాయకత్వం ఈనెల 15 లేదా 16న.. 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, వరుసగా భారీ బహిరంగ సభలకు కూడా భారతీయ జనతా పార్టీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రేస్‌ స్టార్ట్‌ చేసిన కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ దూకుడు..

బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్ధులను ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉండగా.. అధికార బీఆర్‌ఎస్‌ మాత్రం ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించి ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే 115 మందితో అభ్యర్థుల జాబితా విడుదల అందరికంటే ముందుగానే రేస్‌ స్టార్ట్‌ చేశారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో అభ్యర్ధులంతా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తునే.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు సంధిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు ధీటుగా మేనిఫెస్టోను ప్రకటించేందుకు అధినేత కేసీఆర్‌ కసరత్తులు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత మేనిఫెస్టోను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా.. వరుస పర్యటనకు సైతం కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..