Telangana: ఇక ఇల్లు కట్టడం కష్టమే.. సామాన్యులకు ఇప్పుడది ఖరీదైన డ్రీమ్.. ఎందుకంటే.?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు భారత్‌లోని సామాన్యుడి సొంతింటి కలపై నీళ్లు చల్లుతున్నాయి. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే నిర్మాణ వ్యయం ఊహించని రీతిలో పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం క్రమంగా భారతదేశ నిర్మాణ రంగంపై తీవ్రంగా పడుతోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గృహ నిర్మాణానికి అవసరమైన సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇళ్లు నిర్మించాలనుకునే సాధారణ ప్రజలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు భారీ ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల వ్యవధిలోనే సిమెంట్, స్టీల్, రంగులు, ప్లాస్టిక్, టైల్స్, శానిటరీ వేర్ వంటి కీలక వస్తువుల ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా టైల్స్, శానిటరీ వేర్ ధరలు 30 శాతం దాకా పెరగడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. సిమెంట్ బస్తా ధరపై రూ.50 వరకు పెరుగుదల కనిపిస్తుండగా, స్టీల్ ధరలు టన్నుకు 18 నుంచి 25 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రంగుల తయారీ రంగం ముడి చమురు ఆధారంగా ఉండటంతో అక్కడ కూడా ధరల పెరుగుదల తీవ్రంగా కనిపిస్తోంది. రంగుల తయారీలో వినియోగించే పెట్రోలియం ఆధారిత రసాయనాల ధరలు పెరగడంతో రంగుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. మినరల్ టర్పెంటైన్ ఆయిల్ ధర లీటరు రూ.90 నుంచి రూ.135కు చేరడం దీనికి ఉదాహరణ. ప్లంబింగ్ రంగంలో ఉపయోగించే పీవీసీ పైపులు, యూపీవీసీ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. పీవీసీ వస్తువుల ధరలు 30 శాతం వరకు పెరిగితే, యూపీవీసీ ఉత్పత్తుల ధరలు సుమారు 10 శాతం పెరిగాయి. అల్యూమినియం, గ్లాస్ ప్యానెల్స్ ధరలు కూడా పెరగడంతో నిర్మాణ ప్రాజెక్టుల మొత్తం బడ్జెట్ 10 నుంచి 15 శాతం వరకు పెరిగినట్లు బిల్డర్లు చెబుతున్నారు.
ఇక గుజరాత్‌లోని మోర్బి సిరామిక్ పరిశ్రమ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దేశంలో సిరామిక్ ఉత్పత్తుల ప్రధాన కేంద్రంగా పేరొందిన ఈ ప్రాంతంలో సహజ వాయువు కొరత కారణంగా సుమారు 450కు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. టైల్స్ తయారీ తగ్గిపోవడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇటుకలు, ఇసుక ధరలు కూడా పెరిగాయి. గతంలో రూ.8 ఉన్న ఇటుక ధర ప్రస్తుతం రూ.10 నుంచి రూ.12 వరకు చేరింది. డీజిల్, పెట్రోల్ కొరతను కారణంగా చూపుతూ రవాణా ఛార్జీలు కూడా పెంచడంతో నిర్మాణ వ్యయం మరింత భారంగా మారింది. మొత్తంగా చూస్తే, యుద్ధ ప్రభావం నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తూ ఇళ్ల నిర్మాణాన్ని సాధారణ ప్రజలకు అందని ద్రవ్యంగా మార్చుతోంది. ధరల పెరుగుదల కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగం మందగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది చదవండి: లేటుగా సూర్యోదయం.. సాయంత్రం కనిపించని గ్రామం! ఎక్కడో కాదు మన తెలంగాణలోనే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
