Huzurabad TRS: సంక్షేమ పథకాలే సర్కార్ బలం.. ఈటల గెలుపు ఎలా సాధ్యం? ఓడిన టీఆర్ఎస్‌లో అంతర్మథనం!
ఉత్కంఠను రేపిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండేండ్లకు పైనే ఉంది.
Huzurabad By Election – TRS: హుజురాబాద్ ఉత్కంఠకు తెరపడింది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ సాగిన బైపోల్‌లో ఫలితం వచ్చేసింది. ఆత్మగౌరవం, ఆభివృద్ది నినాదంతో సాగిన ఉప పోరులో ఆత్మగౌరవానికే హుజురాబాద్ ప్రజలు పట్టం కట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కే హుజురాబాద్ జీ హుజూర్ అంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23 వేల 865 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నాటి నుంచి హుజురాబాద్ మీద ఉత్కంఠ కొనసాగింది. ఎవరు గెలుస్తారు. ఎన్ని ఓట్లతో గెలుస్తారు. అంతటా ఇదే చర్చ. ఈ ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావించారు అంతా. దాదాపు 5 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన ఎన్నికల పోరులో ఎట్టకేలకు కమలం పార్టీ నుంచి రంగంలోకి దిగిన ఈటల రాజేందర్ గెలిచి నిలబడ్డారు.
ఇటీవల తరచూ ఎదురు దెబ్బలు తింటున్న టీఆర్ఎస్‌కు.. మళ్లీ ఈటల రూపంలో గట్టి షాక్ తగిలింది. పరాభవం అనే మాట ఎరుగని టీఆర్ఎస్ విజయయాత్రకు క్రమంగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. అయితే క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ఆదుకుంటూ, తన రాజకీయ చతురతతో టీఆర్ఎస్ విజయంలో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్న హరీశ్‌రావు ప్రయత్నాలు కూడా ఇటీవల బెడిసి కొడుతున్నాయి. గతంలో అంతా తానై పార్టీని తన భుజస్కంధాలపై ఉంచుకుని నడిపించిన హరీశ్‌రావుకు ట్రబుల్ షూటర్ అని పేరుంది. అయితే ఇంతటి రాజకీయ చతురత ఉన్న హరీశ్‌రావు.. హుజూరాబాద్‌లో విషయంలో బోల్తాపడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హుజురాబాద్ బైపోల్‌లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే సాగింది. హుజూరాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని చెప్పిన మంత్రి హరీశ్‌రావు అంచనాలు తలకిందులయ్యాయి. అయితే ఆయన ప్రచారం వల్లే టీఆర్ఎస్‌కు ఆమాత్రమైనా ఓట్లు పడ్డాయని విశ్లేషకులు చెబుతున్న మాట. హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. అనేక సంక్షేమ పథకాలను చక్కబెట్టారు. అభివృద్ధి పనులను శరవేగంగా పరుగులు పెట్టించారు. ఆఖరికి హుజూరాబాద్‌కు ప్రత్యేకంగా దళితబంధు పథకాన్ని కూడా వర్తింపజేశారు. అయినా ఎన్నికల ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
ఇదిలావుంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపింది. కౌంటింగ్‌లో ప్రతి రౌండ్ ఉత్కంఠభరితంగా సాగింది. టీఆర్‌ఎస్ నేతల అంచనాలను తారుమారు చేస్తూ రౌండ్ రౌండ్‌కు బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్లింది. టీఆర్‌ఎస్ కేవలం రెండు రౌండ్లలోనే ఆధిక్యం కనబర్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఫలితాలపై అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని బండి సంజయ్ అమిత్‌షాకు వివరించారు.
ఈటల గెలుపుతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. హుజూరాబాద్ ఫలితాలపై కార్యకర్తలు పండగ చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో హోరెత్తించారు కార్యకర్తలు. స్వీట్స్ పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు బీజేపీ శ్రేణులు. టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని… అందుకు హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు డీకే అరుణ. ఆత్మగౌరవం విజయం సాధించిందన్నారు. దళితబంధు పథకం లాంచ్ చేసిన గ్రామంలో బీజేపీ ముందంజలో ఉందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని టీఆర్‌ఎస్ కోల్పోయిందని డీకే అన్నారు.
మొత్తానికి ఉత్కంఠను రేపిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండేండ్లకు పైనే ఉంది. ఈలోపు ప్రభుత్వ వ్యతిరేకతను అధికార పార్టీ ఎంతమేరకు అధిగమిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.