Telangana News: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దొంగతనం.. బయోమెట్రిక్ యంత్రాలు చోరీ
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దొంగతనం జరిగింది. దొంగలు ఏకంగా బయోమెట్రిక్ యంత్రాలు మాయం చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో మూడు బైక్స్ అపహరణకు గురయ్యాయి. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించి విచారణ చేపట్టారు.
వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో మూడు బైక్స్ అపహరణకు గురయ్యాయి. అంతేకాదు ఏకంగా సిబ్బంది హాజరుశాతం నమోదుచేసే బయోమెట్రిక్ యంత్రాలు చోరీకి గురైంది. ఎంజీఎం, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది హాజరు నమోదు చేసే బయోమెట్రిక్ యంత్రాలు రెండు సోమవారం సాయంత్రం మాయమయ్యాయి. రాత్రి విధులకు హాజరైన సిబ్బంది గుర్తించి భద్రతా సిబ్బంది, వైద్యాధికారులకు సమాచారం అందించారు.
దీంతో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చిలుక మురళి ఆదేశాల మేరకు ఆర్ఎంవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎంజీఎకు చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించి విచారణ చేపట్టారు. ఎంజీఎంలో మూడు షిప్టుల్లో ఒక్కో షిఫ్ట్‌కు సుమారు 50 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. జనసంచారం ఉన్న ప్రాంతంలోనే దొంగతనం జరగడంతో భద్రతాచర్యలు పర్యవేక్షిస్తున్న ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు సంస్థకు కలెక్టర్ ఆదేశాల మేరకు మెమో జారీ చేయనున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు.
బయోమెట్రిక్ మిషన్ల విచారణ జరుపుతున్న క్రమంలోనే ద్విచ్రవాహనాలపై దొంగల భాగోతం బయటపడింది. వారం రోజుల వ్యవధిలో మూడు బైక్స్ అపహరణకు గురయ్యాయి. పార్కింగ్ స్థలంలో కాకుండా ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో విచ్చలవిడిగా ఎక్కబడితే అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలను టార్గెట్ చేశారు. రెక్కి నిర్వహించి ఆ బైక్స్ దొంగిలించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన బైక్స్ అపహరణ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.