Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్‌ స్టేషన్‌లో ప్రేమ జంట.. 50 మందితో వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు! స్టేషన్‌లోనే..

వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకున్న జంటపై కుటుంబ సభ్యులు దాడి చేశారు. యువతి బంధువులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకువెళ్లి దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ప్రేమజంటను రక్షించి, దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

పోలీస్‌ స్టేషన్‌లో ప్రేమ జంట.. 50 మందితో వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు! స్టేషన్‌లోనే..
Young Couple
G Peddeesh Kumar
| Edited By: SN Pasha|

Updated on: Jun 05, 2025 | 10:48 AM

Share

వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ బుధవారం సాయంత్రం రణరంగంగా మారింది. ఓ ప్రేమజంట పెళ్లి వ్యవహారం ఊహించని ఉద్రిక్తతలకు దారితీసింది. అచ్చం సినీఫక్కీలో ప్రేమజంటపై యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన యువతి బంధువులు ఆ ప్రేమ జంటపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుండి యువతిని లాక్కెళ్లేందుకు బీభత్సం సృష్టించారు. వెంటనే పోలీసులు కలగజేసుకొని ఆ ప్రేమ జంటను రక్షించారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి విచారణ జరుపుకున్నారు.

ఈ దాడి ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన మణిరాజ్, నితీష అనే యువతి యువకుడు ప్రేమపెళ్లి చేసుకున్నారు. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలోని సముద్రాల బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు సుమారు 50 మంది శనిగరం గ్రామానికి చేరుకున్నారు. యువతిని అక్కడి నుండి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అక్కడి నుండి ప్రేమజంట నేరుగా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. యువతి కుటుంబ సభ్యులు, యువకుడి బంధువులతో పోలీసులు కౌన్సిల్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు వారితో మాట్లాడుతున్న క్రమంలోనే యువతి బంధువులంతా పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లారు. ప్రేమ జంటను నల్లబెల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకు ఈడ్చుకొచ్చి స్టేషన్ ఆవరణ లోనే విచక్షణా రహితంగా దాడి చేశారు.

యువకుడిపై పిడిగుద్దులు కురిపిస్తూ.. యువతిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాడికి పాల్పడ్డ పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రేమజంట మేజర్లు కావడంతో వాళ్లకు కౌన్సిలింగ్ చేసి ఆశ్రయం కల్పించిన పోలీసులు అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇద్దరూ మేజర్లే.. కానీ కులాంతర వివాహం కావడమే ఇంతటి ఉదృతతకు కారణమైంది. ఇరు వర్గాలు పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి