వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా 81 మంది విద్యార్థినిలు సస్పెండ్ అయ్యారు. వారిని హాస్టల్‌తోపాటు తరగతుల నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కేయూ పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగింది.? ఎందుకు వారిని సస్పెండ్ చేశారు.? ఎందుకు వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సస్పెండ్ అయిన వారిలో 28 మంది పీజీ విద్యార్థినిలు, 28 మంది ఎకనామిక్స్- కామర్స్ విద్యార్థినిలు, 25 మంది జువాలజీ విద్యార్థినిలు ఉన్నారు. వీరంతా సీనియర్ విద్యార్థులు.. పద్మాక్షి హాస్టల్లో ఆశ్రయం పొందుతూ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలపై సస్పెండ్ చేశారు కాలేజి యాజమాన్యం.
జూనియర్ అమ్మాయిలను ఏడిపించి పైశాచిక ఆనందం పొందారు. హాస్టల్ గదిలో వారిచేత పాటలు పాడించి, డ్యాన్సులు చేయించారు. చెప్పిన మాట వినని జూనియర్ విద్యార్థుల చేత గుంజీలు తీయించారు. వీళ్ళ పైశాచిక ఆనందం మితిమీరిపోవడంతో బాధిత విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కేయూ వైస్ ఛాన్స్‌లర్‌కు బాధిత విద్యార్థులు 18వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కే యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ఆ కమిటీ ర్యాగింగ్ జరిగిందని నిర్ధారించి నివేదిక సమర్పించింది. ప్రొఫెసర్స్ కమిటీ నివేదిక ఆధారంగా 81 మంది విద్యార్థినిలపై చర్యలు తీసుకున్నారు. వారిని వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. వారి పేరెంట్స్‌కు సమాచారం అందించారు. ఐతే అమ్మాయిలు ర్యాగింగ్ కు పాల్పడడం, వారి పై వర్సిటీ పాలక వర్గం చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. ర్యాగింగ్‌కు పాల్పడిన వారు ఆడవారైనా, మగ వారైనా ఒకే విధమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపిన వైస్ ఛాన్సలర్.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..