కరీంనగర్లో నేతల మాటలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్, బిజెపీ నేతల మధ్య విమర్శలు పదునెక్కుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎంపి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. ఇప్పటికే ఈ ఇద్దరి నేతలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దేవుడి పేరుతో ఓట్లు అడగడం సంజయ్‌కి అలవాటుగా మారిందని పొన్నం విమర్శలు చేస్తున్నారు. కరీంనగర్లో ఓడిపోతామన్న భయంతోనే హుస్నాబాద్‌కు వెళ్లిపోయారని కౌంటర్ వేస్తున్నారు సంజయ్. ఇప్పుడు అందరి దృష్టి కరీంనగర్ రాజకీయాలపైనే ఉంది. ఇక్కడ నేతల మాటలు కాకరేపుతున్నాయి. ఒక్కరు బిజెపి నేత సంజయ్ అయితే మరొక్కరు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎంపి స్థానం నుంచి మరోసారి బండి సంజయ్ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ ఎంపి స్థానం నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు పొన్నం పోటీ చేయకున్నా ఆయన పార్లమెంట్ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. సంజయ్‌ను ఖచ్చితంగా ఓడగొడతామని పొన్నం సవాల్ విసురుతున్నారు. ఇటీవల జరిగిన బిజెపి ప్రజాహిత కార్యక్రమంలో బిజెపి, కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరిగాయి. అప్పటి నుంచి బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రభాకర్ స్వంత నియోజకవర్గం హుస్నాబాద్‌లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఈ ఇద్దరు నేతలు పలు ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికల దగ్గర పడిన కొద్ది నేతలు దూకుడు పెంచుతున్నారు.
సంజయ్ అభివృద్ధి చేయడమే చేత కాకా రాముడితో రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఎన్ని నిధులు తెచ్చావో ప్రజలకు చెప్పే ధైర్యం లేదని ఆరోపిస్తున్నారు. అయితే అదే స్థాయిలో బండి సంజయ్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వేగంగా అభివృద్ధి జరగిందని అంటున్నారు. నేషనల్ హైవేలు ఆర్ఓబి నిర్మాణాలు జరిగాయని అంటున్నారు. అంతేకాకుండా తాను ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి చేశాననే విషయాన్ని కూడా పక్కా లెక్కలతో చెబుతున్నానని అంటున్నారు బండి సంజయ్. తాము రాముడిని పూజిస్తామని.. మీలా రాజకీయాల్లో లాగమని పొన్నం అంటున్నారు. ప్రతి ఇంటికి రాముడి ఫోటో పంపిణీ చేసి దేవుడు పేరుతో ఓట్లు అడుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అంటున్నారు పొన్నం ప్రభాకర్. అయితే దీనికి కౌంటర్‌గా తాము రాముడిని పూజిస్తామని, ఆయోధ్యలో రామ మందిరం గురించి వివరిస్తున్నామని, అలా చేస్తే తప్పు ఏంటని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. అక్షింతలపై ఆరోపణలు చేసిన పొన్నంకు రాముడి గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. బిజెపి నుంచి సంజయ్.. బిఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. ఇంకా కాంగ్రెస్ టికెట్ ఖారారు కానప్పటికీ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ప్రచార కార్యక్రమంలో జోరుగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ను చూసి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..