AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బడిబాట’కు బంపర్ ఆఫర్.. ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఇంటి పన్ను, నల్లా బిల్లు రద్దు!

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం లక్ష్యంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే వారికి ఇంటి పన్ను, నల్లా పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది.

‘బడిబాట’కు బంపర్ ఆఫర్.. ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఇంటి పన్ను, నల్లా బిల్లు రద్దు!
Zphs, Bommakal
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 12:34 PM

Share

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం లక్ష్యంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే వారికి ఇంటి పన్ను, నల్లా పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది.

గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో వాటి మనుగడను కాపాడేందుకు గ్రామస్తుల సహకారంతో ఈ తీర్మానం చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కుటుంబాలకు సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రాధాన్యత కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

గ్రామపంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి తీసివేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు తెలిపారు. గ్రామంలో నిర్వహిస్తున్న ‘బడిబాట’ కార్యక్రమం కూడా ఈ ప్రక్రియకు ఊతమిస్తోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించామని చెప్పారు. గ్రామపంచాయతీ పన్ను మినహాయింపు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు 12 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందినట్లు వెల్లడించారు. మరికొంతమంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రామస్థాయిలో తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us