తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నాయకత్వ మార్పు ఉంటుందన్న ఊహగానాలు సైతం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, నాయకత్వ మార్పు విషయంపై తాజాగా.. ఆపార్టీ కీలక నాయకురాలు విజయశాంతి స్పందించారు. తెలంగాణలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నోసార్లు తమ ముఖ్యనేతలు కూడా ధృవీకరించారని వివరించారు. అయితే, ఈ విషయంలో అయోమయం సృష్టించేందుకు, చివరికి మీడియాని కూడా తప్పుదారి పట్టించేందుకు ఇతర పార్టీల నాయకులు కుట్రలు పన్నుతున్నారంటూ మండిపడ్డారు. ఇతర పార్టీల నాయకుల ప్రచారాన్ని తిప్పికొడుతూ విజయశాంతి ప్రకటన విడుదల చేశారు.
కొద్ది రోజుల కిందటే మన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయమై మీడియా ద్వారా స్పష్టత ఇచ్చినప్పటికీ.. తాజాగా ఒక మీడియా మిత్రుడు సంజయ్ అధ్యక్ష పదవి గురించి తమ పార్టీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ను ప్రశ్నించారని.. ఆయన కూడా ఎంతో స్పష్టంగా బదులిచ్చారంటూ వెల్లడించారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రశంసించడాన్ని లక్ష్మణ్ గుర్తు చేశారన్నారు. ప్రధాని ఇచ్చిన కితాబే సంజయ్ కొనసాగింపునకు సంకేతమని విజయశాంతి తేల్చి చెప్పారు. సందిగ్ధతలు బీజేపీలో ఎన్నడూ ఉండవని.. కేసీఆర్ కుయుక్తుల ప్రచారాలు ఇక్కడ చెల్లవంటూ కౌంటర్ ఇచ్చారు.
జాతీయవాదులు, హిందూ బంధువులు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక శివాజీ మహరాజ్ ప్రతిరూపపు ఆవేశంతో, నరేంద్ర మోడీ స్ఫూర్తితో బండి సంజయ్ అధ్యక్షతన రాబోయే ఎన్నికల రణక్షేత్రానికి ఇప్పటి నుండే అనుక్షణం సైనికులై పనిచేసే సందర్భం ఆసన్నమైందంటూ విజయశాంతి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..