Telangana: సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఆ నిధులు విడుదల చేయాలని డిమాండ్..
హైదరాబాద్ మహా నగరానికి తలమానికంగా నిలిచేలా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం..

హైదరాబాద్ మహా నగరానికి తలమానికంగా నిలిచేలా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం మేరకు ఆర్ఆర్ఆర్ భూసేకరణ వ్యయంలో 50% నిధులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు డిపాజిట్ చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.26వేల కోట్లకు పైగా కేంద్రం భరిస్తుంటే.. భూసేకరణలోని 50% నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి కి నిదర్శనంగా నిలుస్తోందని ఎద్దేవా చేశారు. రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని లేఖలో వివరించారు. గతంలో కేటాయించిన రూ.500 కోట్లు కూడా విడుదల చేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి లో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు 342 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేసే కే అండ్ జే సంస్థను కన్సల్టెన్సీగా నియమించారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణభాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని ప్రాథమిక అలైన్‌మెంటులో పేర్కొనగా.. ఇప్పుడు పూర్తి స్థాయి కన్సల్టెన్సీ తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయనుంది. పూర్తి స్థాయి డీపీఆర్ రూపొందితే వ్యయంపై స్పష్టత రానుంది. దక్షిణ భాగం వ్యయం రూ.15 వేల కోట్లకు చేరవచ్చని అంచనా వేశారు.
ఉత్తర భాగం.. సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, యాదాద్రి మీదుగా చౌటుప్పల్ వరకు.. సుమారు 160 కిలోమీటర్లు ఉండగా.. భారత్‌మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్–1లో గుర్తింపు లభించింది. నిర్మాణానికి మొత్తంగా రూ.9,500 కోట్లకు పైగా ఖర్చవుతాయని అంచనా వేశారు. దక్షిణ భాగం.. సంగారెడ్డి నుంచి కంది, నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు.. దాదాపు 182 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. భారత్‌మాల పరియోజన ప్రాజెక్టు ఫేజ్ 2 కింద గుర్తింపు దక్కింది. నిర్మాణానికి మొత్తంగా రూ.15 వేల కోట్లకు పైగా ఖర్చవుతాయని అంచనా వేశారు.




మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..