Kishan Reddy: కాజీపేట యూనిట్‌లో 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన..
కాజీపేట.. ఇకపై దేశవ్యాప్తంగా నడిచే అత్యాధునిక రైళ్లను తయారు చేసే మెగా హబ్‌గా మారబోతుంది. రానున్న ఐదేళ్లలో ఏకంగా 200 సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లను పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే శాఖ ముమ్మరంగా ప్లాన్ చేస్తోంది. భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రం నుండి.. రాబోయే ఐదేళ్లలో వందలాది సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కాజీపేటలోని ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావొచ్చిందని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టుతో కలిసి అశ్వినీ వైష్ణవ్ కీలక సమీక్ష నిర్వహించారు. రానున్న ఐదేళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేస్తుందన్నారు. వీటిని దేశవ్యాప్తంగా 300 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు ప్రత్యేక షటిల్ సర్వీసులుగా ఉపయోగిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. తెలంగాణకు నిరంతరం మద్దతు ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు, తెలంగాణలోని కాజీపేటలో ఉన్న రైల్వే తయారీ యూనిట్ (RMU) సమీక్షలో వైష్ణవ్.. రాబోయే 5 సంవత్సరాలలో 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేసే బాధ్యతను ఈ కేంద్రానికి అప్పగించారని తెలిపారు.
కిషన్ రెడ్డి ట్వీట్..
Grateful to Hon’ble Prime Minister Shri @narendramodi and Railway Minister Shri @AshwiniVaishnaw Ji for their continuous support for Telangana.
Today, in his review of the Railway Manufacturing Unit (RMU) in Kazipet, Telangana Shri Vaishnaw ji entrusted this facility to… https://t.co/lvlYfSYP5m
— G Kishan Reddy (@kishanreddybjp) May 28, 2026
ఈ ఇంటర్‌సిటీ రైళ్లు 20-కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో, ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక సదుపాయాలను కలిగి ఉంటాయన్నారు. ఈ ఇంటర్‌సిటీ రైళ్లు సాధారణంగా సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. పట్టణాలు, నగరాల మధ్య పౌరులు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రతి ట్రిప్‌లో అనేక స్టాప్‌లు ఉంటాయి. ఇవి గంటకు 130 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణిస్తాయి. ఈ రైళ్లు తమ సమీప పట్టణాలలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు, లేదా తమ ఆరోగ్యం, ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణించే సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ రైళ్లలో సురక్షితమైన కోచ్ డిజైన్, ఆధునిక సౌకర్యాలు అమర్చనున్నారు. ఈ రైళ్లు గంటకు 130 కి.మీ వేగంతోపాటు.. వీటిలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది.. రైలు బ్రేకులు వేసినప్పుడు అది విద్యుత్ జనరేటర్‌గా మారుతుందని, ఆ విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌లోకి పంపే అధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ రైళ్ల వల్ల రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా అదుపులోకి వస్తుందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా గ్రీన్ అండ్ క్లీన్ ట్రాన్స్‌పోర్ట్ కెపాసిటీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
