Hyderabad: దారుణం.. ఒకే రోజు ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య..! కాలేజీ యామన్యాలపై అనుమానాలు

|

Dec 03, 2024 | 7:16 AM

రాష్ట్రంలోని రెండు వేర్వేరు చోట్ల ఒకే రోజు ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం చర్చణీయాంశంగా మారింది. అయితే ఆయా కాలేజీల యాజమన్యాలను మాత్రం విద్యార్ధుల ఆత్మహత్యలను సహజ మృతిగా చిత్రీకరించేందుకు హైడ్రామా చేశారు..

Hyderabad: దారుణం.. ఒకే రోజు ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య..! కాలేజీ యామన్యాలపై అనుమానాలు
Inter Students Suicide
Follow us on

సూర్యాపేట, డిసెంబర్‌ 3: తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఒకే రోజు ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలో విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్న తరుణంలో ఒకే రోజు ఇద్దరు విద్యార్ధుల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారాయి. వివరాల్లోకెళ్తే..

అన్నోజిగూడ నారాయణ జూనియర్ కాలేజీలో ఉరి పెట్టుకుని ఒకరు..

బీబీనగర్‌ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌ నాయక్‌ (16) అనే విద్యార్ధి అన్నోజిగూడలోని నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ (ఎంపీసీ) చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం హాస్టల్‌ బాత్‌రూమ్‌లోకి వెళ్లిన తనుష్‌ ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో ఆందోళన చెందిన తోటి విద్యార్థులు, హాస్టల్‌ సిబ్బంది తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే తనుష్‌ ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అనుష్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నేరుగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనుష్‌ మృతిపై కాలేజీ యాజమన్యం చెబుతున్న సమాధానం పలు అనుమానాలకు తావిస్తుంది. విద్యార్ధికి ఫిట్స్‌ వచ్చాయని, అందుకే మృతి చెందాడని నిస్సిగ్గుగా బుకాయిస్తుంది. బాత్రూంలో ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించిన విద్యార్ధికి.. ఫిట్స్‌ ఎలా వచ్చి మృతి చెందాడో సదరు కళాశాల నిర్వాహకులకే తెలియాలి. మృతుడి తల్లిదండ్రులు మాత్రం కాలేజీలో అధ్యాపకుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఆరోపించారు. దీంతో తనుష్‌ తల్లిదండ్రులతోపాటు బంధువులు, విద్యార్థి సంఘాలు కాలేజీ తీరును తప్పుబడుతూ నిరసనకు దిగారు.

నిజామాబాద్‌ ఎన్‌ఎస్‌ఆర్‌ కాలేజీలో మరో ఇంటర్‌ విద్యార్ధి సూసైడ్‌

నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం చిన్నతడం గ్రామానికి చెందిన ప్రజ్ఞారెడ్డి అనే విద్యార్ధి ప్రగతినగర్‌లోని ఎన్‌ఎస్‌ఆర్‌ ఇంపల్స్‌ ఐఐటీ గల్స్‌ కాలేజీలో ఇంటర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఏం జరిగిందో తెలియదుగానీ సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రజ్ఞారెడ్డి తన హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని దాచి పెట్టేందుకు యత్నించిన కాలేజీ యాజమాన్యం హైడ్రామాకు తెరదించింది. హుటా హుటిన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించింది. దీంతో విద్యార్ధిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజ్ఞారెడ్డి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాలేజీలో వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.