రంగం కార్యక్రమంలో భయంగొలిపేలా భవిష్యవాణి.. మొక్కుబ‌డిగా పూజ‌లు చేస్తున్నారంటూ అమ్మవారి ఆగ్రహం..!

| Edited By: Ravi Kiran

Jul 18, 2022 | 8:40 PM

అమ్మవారికి ఎంత భక్తితో బోనం సమర్పిస్తారో అంతే భక్తిభావంతో రంగాన్ని ఆలకిస్తారు భక్తులు. రంగంలో అమ్మవారు ఏం చెప్తారన్నది భక్తులు ఎంతో ఆసక్తిగా వింటారు. ఈసారి రంగంలో అమ్మవారి మాటలు భక్తులను భయంగొల్పేలా చేశాయి.

రంగం కార్యక్రమంలో భయంగొలిపేలా భవిష్యవాణి.. మొక్కుబ‌డిగా పూజ‌లు చేస్తున్నారంటూ అమ్మవారి ఆగ్రహం..!
Swarnalatha
Follow us on

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగ‌రంగ వైభవంగా జ‌రిగాయి. భారీ ఎత్తున భ‌క్తులు అమ్మ‌వారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.. బోనాల ఉత్సవాల్లో భాగంగా కీలక ఘట్టమైన రంగం ఆ మర్నాడు సోమవారం వైభవంగా జరిగింది. జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అయితే, ఈ సారి స్వర్ణలత చెప్పిన భవిష్యవాణి భక్తుల్లో ఆందోళన రేపుతోంది. మూడులోకాలు ఏలే మూలపుటమ్మ మహాంకాళి తల్లికి ఆగ్రహం వచ్చిందా..? అనే ఆందోళన భక్తుల్లో కనిపించింది. రంగంలో చెప్పిన భవిష్యవాణి దేనికి సంకేతం? అమ్మవారి కోపానికి కారణమేంటి? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అసలు రంగంలో చెప్పినట్టు అమ్మవారి రూపురేఖల్లో మార్పులు జరిగాయా? ఆలయ అధికారులేమంటున్నారు? భక్తజనుల మనోగతమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

బోనాల సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా రంగం కార్యక్రమం నిలుస్తుంది. బోనాలు మరుసటి రోజు ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో రంగం కార్యక్రమం ఉంటుంది. స్వర్ణలత అనే మహిళకు అమ్మవారు పూనుతారు. ఆమె నోటి నుంచి వచ్చే మాటలు స్వయంగా అమ్మవారే చెప్పినట్టుగా భావిస్తారు భక్తజనులు. అమ్మవారికి ఎంత భక్తితో బోనం సమర్పిస్తారో అంతే భక్తిభావంతో రంగాన్ని ఆలకిస్తారు భక్తులు. రంగంలో అమ్మవారు ఏం చెప్తారన్నది భక్తులు ఎంతో ఆసక్తిగా వింటారు. ఈసారి రంగంలో అమ్మవారి మాటలు భక్తులను భయంగొల్పేలా చేశాయి. పూజలు మెక్కుబడిగా చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పూజలు వారి సంతోషానికే తప్ప.. తన కోసం చేయడం లేదని చెప్పారు. తనకు పూజలు చేస్తున్నారా వాస్తవం చెప్పండని ప్రశ్నించారు. ప్రతి ఏడాది నాకు ఆటంకమే కలిగిస్తున్నారని.. మొక్కుబడి పూజలు చేస్తున్నా తన బిడ్డలే అని భరిస్తున్నానని తెలిపారు. గర్భాలయంలో శాస్త్రబద్దంగా పూజలు చేయాలని చెప్పారు. మొక్కుబడిగా కాకుండా.. సక్రమంగా పూజలు జరిపించాలన్నారు. సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. ఎన్నితప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కదా బాలక..మహిళలు గర్భిణీలకు ఇబ్బంది లేకుండా చూస్కుంటా.. పూజలు మనసుపెట్టి ఘనంగా నిర్వహించండి..అని అన్నారు.

తన రూపాలు ఎందుకు మార్చుతున్నారని భవిష్యవాణిలో ఈసారి అమ్మవారు ప్రశ్నించారు. మీకు నచ్చినట్టుగా మారుస్తారా అని ప్రశ్నించారు. స్థిరమైన రూపంలో కొలువుదీరాలని అనుకుంటున్నానని చెప్పారు. ‘‘మీరు నాకు చేసిందేమిటి..?. దొంగలు దోచినట్టుగా నా నుంచే మీరు కాజేస్తున్నారు. మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నాను. ఆగ్రహం తట్టుకోలేరనే కోపాన్ని గోరంతే చూపుతున్నాను. మీరు కొండంత తెచ్చుకుంటున్నా నాకు గోరంతే పెడుతున్నారు. భక్తులు కంటతడి పెట్టకుండా చూడండి. నా బిడ్డలకు ఆపద రానివ్వను’’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రంగం కార్యక్రమం తర్వాత ఏనుగుపై అమ్మవారి పటం ఊరేగింపు ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా అమ్మవారి దర్శనంపై ఆంక్షలు విధించడం జరిగింది. భవిష్యవాణిలో అమ్మవారు చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకుంటామని, అమ్మవారి రూపు మార్చడానికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలన జరుపుతామని ఆలయ అధికారులు తెలిపారు. ఉజ్జయిని నుంచి దారు రూపంలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. కాలక్రమంలో ఆ విగ్రహం శిధిలావస్థకు చేరడంతో ఆ స్థానంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు.. ఆ తర్వాత అక్కడ తవ్విన బావిలో మాణిక్యాల దేవి విగ్రహం దొరికిందని గుర్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి