Telangana: పెళ్లైన 16 ఏళ్లకు పుట్టిన బిడ్డ.. చనిపోయిందనుకున్న పాము చిన్నోడి జీవితాన్ని చిదిమేసింది
చనిపోయిందనుకున్న పాము ఒక్కసారిగా పైకిలేచి పక్కనే నిలబడి చూస్తున్న మహిళ చేతిలోని చిన్నారి నైతిక్‌ను కాటేసింది. హుటాహుటిన బాలుణ్ణి వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయినా కానీ...
ఆ దంపతులు.. సంతానం కోసం మొక్కని మొక్కు లేదు.. చేయని పూజ లేదు.. దర్శించని దేవాలయం లేదు. పెళ్లయిన పదహారేళ్లకు దేవుడు వారి మొర విన్నాడు. పండంటి బిడ్డ పుట్టాడు. దీంతో ఆ చిన్నోడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ ఇంతలోనే విధికి కన్ను కుట్టింది. చనిపోయిందనుకున్న పాము ఆ బాలుడిని కాటేసి ఆ తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ బాబును కాటేయడానికే పాము అక్కడికి వచ్చిందా అన్నట్లు ఈ ఘటన తీరుతెన్నులు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా(adilabad district) భీంపూర్(bhimpur)మండలం అంతర్గాంలో నివాసముంటున్న బైరెడ్డి సంతోష్-అర్చన దంపతులకు రెండళ్ల వయస్సున్న నైతిక్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నోడు గురువారం వేకువజామునే నిద్రలేచి పక్కింటావిడ వద్ద ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో పాము కనిపించింది. దీంతో గ్రామస్థులు ఆ పామును కర్రతో కొట్టి.. చనిపోయిందనుకుని పామును పక్కకు జరిపారు.
ఇంతలోనే ఆ పాము ఒక్కసారిగా పైకిలేచి పక్కనే నిలబడి చూస్తున్న మహిళ చేతిలోని చిన్నారి నైతిక్‌ను కాటేసింది. హుటాహుటిన బాలుణ్ణి వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పాము బాగా విషపూరితమైనది కావడంతో.. డాక్టర్లు అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. గురువారం రాత్రి నైతిక్ ఈ లోకాన్ని వీడాడు. ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన తర్వాత పుట్టిన బిడ్డ కళ్ల ముందే కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..