Telangana: చుట్టూ వరద.. కాపాడాలంటూ ఆర్తనాదాలు.. రంగంలోకి దిగిన హెలికాప్టర్.. కట్ చేస్తే
మంచిర్యాల (Mancherial) జిల్లా చెన్నూరు మండలంలోని సోమన్ పల్లి వద్ద గోదావరి (Godavari) నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మేకలను కాసేందుకు వెళ్లిన కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తింది. దీంతో వారు...
మంచిర్యాల (Mancherial) జిల్లా చెన్నూరు మండలంలోని సోమన్ పల్లి వద్ద గోదావరి (Godavari) నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మేకలను కాసేందుకు వెళ్లిన కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తింది. దీంతో వారు వాటర్ ట్యాంక్ ఎక్కి, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ఉద్ధృతి తీవ్రం కావడం తో ఎవరు వారిని కాపాడే సాహసం చేయలేకపోయారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వారిని కాపాడేందుకు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. వెంటనే అప్రమత్తమై హుటాహుటిన హెలికాప్టర్ ను తెప్పించి ఇద్దరినీ సురక్షితంగా బయటకు తరలించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.
మరోవైపు.. మంచిర్యాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ నుంచి శ్రీరామ్‌సాగర్, ఆపై ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద వస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 54 గేట్లు ఎత్తివేయడంతో మంచిర్యాలలోని కాలనీల్లోకి వరద చేరింది. రాళ్లవాగు ప్రవాహంతో మంచిర్యాలకు వరద ముప్పు పెరుగుతోంది. మంచిర్యాలలోని ఎన్టీఆర్ కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, రామ్‌నగర్, పద్మశాలీవాడతో పాటు పలు కాలనీల్లోకి చేరింది. గోదావరి బ్రిడ్జిపై నుంచి వరద నీరు పోటెత్తడంతో కరీంనగర్, మంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.