Telangana: 10 వేల బస్తాల ధాన్యాన్ని ఎలుకలు తినేసాయట..
తూప్రాన్‌లోని మల్కాపూర్ సాయి బాలాజీ రైస్ మిల్లులో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ధాన్యం బస్తాల్లో వరి పొట్టు కనిపించడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. 2022-23, 2024-25 సీజన్లకు సంబంధించిన 10,424 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ధాన్యం ఎలుకలు తినేశాయని మిల్లు యాజమాన్యం చెప్పగా.. అధికారులు రికార్డులు, నిల్వలను పరిశీలించి కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేశారు.

తూప్రాన్‌లో రైస్ మిల్లులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ధాన్యం బస్తాల్లో వరి ఉండాల్సి ఉండగా.. అందులో వరి పొట్టు దర్శనమిచ్చింది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో మిల్లుపై అధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేశారు.
మల్కాపూర్‌లోని సాయి బాలాజీ రైస్ మిల్లుపై పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ తాటి నర్సింలు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ధాన్యం బస్తాల్లో వడ్లకు బదులుగా వరి పొట్టు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ధాన్యం బస్తాల్లో వరి పొట్టు ఎలా వచ్చిందని అధికారులు మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ఎలుకలు ధాన్యాన్ని మొత్తం తినేయడంతో బస్తాల్లో కేవలం పొట్టు మాత్రమే మిగిలిందని యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
అయితే మిల్లు రికార్డులు, నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. అసలు విషయం మరోలా ఉన్నట్లు గుర్తించారు. అధికారుల ప్రాథమిక పరిశీలన ప్రకారం.. 2022-23 సంవత్సరానికి సంబంధించిన టెండర్ ధాన్యంలో 8,268 బస్తాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. అలాగే 2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన మరో 2,156 బస్తాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రెండు సీజన్లకు కలిపి మొత్తం 10,424 ధాన్యం బస్తాల లెక్కల్లో తేడాలు కనిపించడంతో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి.. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ధాన్యం బస్తాల్లో వరి పొట్టు నింపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రభుత్వ ధాన్యానికి సంబంధించిన వ్యవహారంలో అవకతవకలు గుర్తించడంతో సాయి బాలాజీ రైస్ మిల్లుపై కేసు నమోదు చేసి, మిల్లును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మిల్లులో మిగిలి ఉన్న ధాన్యాన్ని ఘణపూర్‌లోని సాయినాథ్ రైస్ మిల్లుకు తరలించినట్లు డిప్యూటీ తహసీల్దార్ తాటి నర్సింలు వెల్లడించారు.
ఈ ఘటనతో ప్రభుత్వ ధాన్యం నిల్వల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎంత మొత్తంలో ధాన్యం పక్కదారి పట్టింది..? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది..? అనే అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
