AI Photo: మీ ఒక్క 80ల నాటి ఏఐ ఫోటోకు 0.29 యూనిట్ల కరెంటు ఖర్చు
AI Photo: పర్యావరణం మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత గోప్యతకు కూడా ఈ ట్రెండ్ పెద్ద ముప్పుగా మారుతోంది. మీ ముఖ కవళికలు స్పష్టంగా ఉన్న ఫోటోలను ఇలాంటి థర్డ్ పార్టీ టూల్స్ కు అప్లోడ్ చేసినప్పుడు మీ అమూల్యమైన బయోమెట్రిక్ డేటా ఆయా..

AI Photo: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 1980ల నాటి ఏఐ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. అయితే మీరు క్రియేట్ చేసే ఒక్కో ఏఐ ఫోటోకు సగం స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి సరిపడా, అనగా దాదాపు 0.29 కిలోవాట్ల విద్యుత్ ఖర్చవుతుందని నివేదికలు చెబుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఓపెన్ చేయగానే పాత కాలం నాటి హెయిర్ స్టైల్, రెట్రో లుక్ తో ఉన్న స్నేహితుల ఫోటోలు విరివిగా దర్శనమిస్తున్నాయి. చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐ టూల్స్ వాడి తమ ప్రస్తుత ఫోటోలను 1980ల కాలం నాటివిగా సులభంగా మార్చేస్తున్నారు. ఎలాంటి ఎడిటింగ్ నైపుణ్యాలు లేకుండానే సెల్ఫీలను పాతకాలపు చిత్రాలుగా మార్చుకునే అవకాశం ఉండటంతో నెటిజన్లు దీనికి బాగా ఆకర్షితులవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యాడ్ యువర్స్ ఫీచర్ వాడి తమ ఫోటోలను షేర్ చేస్తూ ఈ వైరల్ ట్రెండ్ లో భాగస్వామ్యులు అవుతున్నారు.
ఈ ట్రెండ్ పట్ల క్రేజ్ పెరగడానికి ముఖ్య కారణం ఇది చాలా సులభంగా అందుబాటులో ఉండటమే. కేవలం మొబైల్ కెమెరాతో తీసిన సెల్ఫీని ఏఐ టూల్ లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ కృత్రిమ మేధస్సు వెంటనే మీ బట్టలు, హెయిర్ స్టైల్, బ్యాక్ గ్రౌండ్ మొత్తాన్ని ఎనభైల కాలం నాటి స్టైల్ లోకి మార్చేస్తుంది. పాత కాలంలో తాము ఎలా ఉండేవాళ్లమో చూసుకోవాలనే ఆసక్తితో లక్షలాది మంది నెటిజన్లు ఏఐ ఖాతాల ద్వారా రోజుకు కోట్లాది ఫోటోలను సృష్టిస్తున్నారు.
అయితే ఈ ఆనందం వెనుక పెద్ద పర్యావరణ ముప్పు దాగి ఉంది. మీరు సెకన్ల వ్యవధిలో క్రియేట్ చేసే ఈ ఒక్కో ఏఐ ఫోటోకు భారీ డేటా సెంటర్లు రేయింబవళ్లు పనిచేయాల్సి వస్తుంది. ఒక సింగిల్ ఏఐ ఇమేజ్ క్రియేట్ చేయడానికి 0.01 నుంచి 0.29 కిలోవాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. దీనికి తోడు డేటా సెంటర్లను చల్లబరిచేందుకు భారీ స్థాయిలో స్వచ్ఛమైన నీటిని కూడా వినియోగిస్తున్నట్లు తాజా సమాచారం స్పష్టం చేస్తోంది.
పర్యావరణం మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత గోప్యతకు కూడా ఈ ట్రెండ్ పెద్ద ముప్పుగా మారుతోంది. మీ ముఖ కవళికలు స్పష్టంగా ఉన్న ఫోటోలను ఇలాంటి థర్డ్ పార్టీ టూల్స్ కు అప్లోడ్ చేసినప్పుడు మీ అమూల్యమైన బయోమెట్రిక్ డేటా ఆయా కంపెనీల చేతుల్లోకి వెళుతుంది. చాలా ఏఐ కంపెనీలు ఇలా యూజర్లు అప్‌లోడ్ చేసిన ఫోటోలను తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు వాడుకుంటాయి.
మీరు సరదాగా అప్‌లోడ్ చేసే ఈ ఫోటోల వల్ల భవిష్యత్తులో డీప్ ఫేక్ లాంటి ముప్పులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. మీ ముఖ ఆకృతి, చర్మపు రంగు లాంటి సున్నితమైన వివరాలు ఏఐ డేటా బేస్ లో నిక్షిప్తం అవుతాయి. ఒకసారి అప్‌లోడ్ చేసిన ఫోటోను ఆయా కంపెనీలు ఎన్ని రోజుల పాటు తమ సర్వర్లలో భద్రపరుస్తాయనే దానిపై ఎలాంటి స్పష్టతా ఉండదు. చట్టపరమైన నిబంధనలు కూడా అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండకపోవడం దీనికి మరో కారణం.
అందుకే ఇలాంటి ట్రెండ్స్ ను ఫాలో అయ్యే ముందు కాస్త అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఏఐ టూల్స్ కు ఫోటోలు ఇచ్చే ముందు ఆయా యాప్స్‌కు సంబంధించిన ప్రైవసీ పాలసీని చదవడం ఎంతో ఉత్తమం. మీరు వాడే ఒకే ఫోటోను పదే పదే వివిధ రకాల టూల్స్ కు అప్లోడ్ చేయకుండా చూసుకోవాలి. వీలైతే మీ ఫోటోలతో పని పూర్తయిన వెంటనే ఆయా ఏఐ ప్లాట్ ఫామ్స్ నుంచి మీ డేటాను పూర్తిగా తొలగించే ఆప్షన్ ను వినియోగించుకోవడం చాలా మంచిది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
