Talasani Srinivas Yadav: ‘అంబర్‌పేట’ బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్న మంత్రి తలసాని.. ఇంకా ఏమన్నారంటే..?

|

Feb 23, 2023 | 4:01 PM

బాలుడు చనిపోయాడని ఏదో హడావుడి చేస్తున్నామనడం సరికాదని అన్నారు. విమర్శించేందుకు ఇచ్చే సలహాలను పట్టించుకోమని, కుక్కల..

Talasani Srinivas Yadav: ‘అంబర్‌పేట’ బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్న మంత్రి తలసాని.. ఇంకా ఏమన్నారంటే..?
Talasani Srinivas Yadav
Follow us on

కుక్కల దాడిలో అంబర్‌పేటలో బాలుడు మరణించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామని, సమాజంలో మనుషులెంత ముఖ్యమో జంతువులు కూడా అంతే అవసరమని ఆయన పేర్కొన్నారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో సమావేశమైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. బాలుడు చనిపోయాడని ఏదో హడావుడి చేస్తున్నామనడం సరికాదని అన్నారు. విమర్శించేందుకు ఇచ్చే సలహాలను పట్టించుకోమని, కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు తెలుసని, మరింత మెరుగైన చర్యలు తీసుకునేందుకే తాము సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

అయితే వీధి కుక్కల నియంత్రణ కోసం తీసుకోవలసిన చర్యల గురించి వెటర్నరీ అధికారులతో ప్రధానంగా చర్చించారు ఆయన. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. నగరంలో వీధి కుక్కలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయని, ముఖ్యంగా మాంసం దుకాణాల వద్ద, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయని అన్నారు. మటన్, చికెన్ షాపుల వద్ద ఉదయం, రాత్రి వేళల్లోనూ స్పెషల్ డ్రైవ్స్ పెడతామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం వీధి కుక్కల బెడదను తగ్గించే విషయంలో ప్రత్యేక గ్రూపులు, టోల్ ఫ్రీం నెంబర్, ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వీధి కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి చెప్పారు.

మరోవైపు కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని, అందుకోసం కొత్త టెక్నాలజీని వాడుతున్నామని అన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి మాటలను రాజకీయం చేయడాన్ని తలసాని తప్పుబట్టారు. మేయర్ మాట్లాడిన మాటలు వక్రీకరించారని అన్నారు. స్వచ్ఛంద సంస్థలకు ఏమైనా అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలని తలసాని తెలిపారు. జంతు ప్రేమికులు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటే ఇబ్బందికర పరిణామాలు వస్తాయని మంత్రి తలసాని అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, నగరంలోని అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు(ప్రదీప్) మరణించిన విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాక ఈ కుక్కల దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవడంతో పాటు నగరంలో వీధి కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..