TRS Telangana Vijaya Garjana: ఈ నెల 15వ తేదీన టీఆర్ఎస్ పార్టీ జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభ వాయిదా పడింది. తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన ఈ సభను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ప్రకటించారు. సోమవారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు, మంత్రలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్య నేతలు సభను 29 నిర్వహించాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. దీంతో సభను 29 నే నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న తరుణంలో.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’’ అంటూ నినదించిన కేసీఆర్ నవంబర్ 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు తరువాత నవంబర్ 29ని దీక్షా దివస్‌గా ప్రకటించారు. ఆ తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సమయం, సందర్భం అని నేతలు అభిప్రాయడ్డారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన ధీక్షా దివస్ రోజే జరపాలన్న వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.
కాగా, చారిత్రాత్మక తెలంగాణ విజయ గర్జన సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల టీఆర్ఎస్ నేతలు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కాగా, నవంబర్ 15నే సభ ఉంటుందనుకుని.. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను నవంబర్ 29 వ తేదీకి మార్చుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు.
Also read:
Suriya & Jyotika: హీరో సూర్య దంపతుల దాతృత్వం.. పిల్లల చదువుల కోసం మరో ముందడుగు.. అసలేం చేశారంటే..
Karnataka Tourism: కర్ణాటక అందాలు చూడతరమా.. ఒక్కసారి ఈ ప్రాంతాలు చూస్తే చాలు మైమరిచిపోతారు.!