Munugode Bypoll: మునుగోడులో ఏ అవకాశాన్నీ వదులుకోని టీఆర్ఎస్.. ఆర్టీసీ ఓట్ల వేటలో అధికార పార్టీ నేతలు.. ఏం చేస్తున్నారంటే..
మునుగోడు ఉప ఎన్నికలో ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ఏ చిన్న అవకాశాన్నీ వదులు కోవడం లేదు. గతంలో నిరసనలు, ఆందోళనలు చేసినా ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా..పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చడానికి ముందుకొచ్చింది.. నియోజక వర్గంలో ఉన్న 8 వేల ఓట్లకు గాలం వేస్తోంది..ఇప్పటికే మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో సంప్రదింపులు మొదలుపెట్టిందట.

అధికార పార్టీ మునుగోడులో జెండా ఎగరేసేందుకు అన్ని దారులూ వెతుకుతోంది. ఆర్టీసీ కార్మికులకు బాకీ ఉన్న రెండు పీఆర్సీలు, ఆరు డీఏలు, ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలు.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్చలు.. ఆర్టీసీ కార్మికులకు మొత్తం ఆరు డీఏలు, రెండు పీఆర్సీలు బాకీ ఉన్నాయి. అసెంబ్లీ వేదికగా హామీలు ఇచ్చినా వాటిని ప్రభుత్వం నెరవేర్చలేదు. అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఉప ఎన్నిక రావడంతో వారి ఓట్ల కోసం మంత్రులు చర్చలు జరుపుతున్నారట. దీంతో పీఆర్సీ అమలుతోపాటు దీపావళిలోగా డీఏలు విడుదల, సీసీఎస్, బాండ్ల బకాయిలు ఇవ్వాలని కార్మికులు ప్రధాన డిమాండ్లుగా పెట్టారు.
మంత్రులు మాత్రం.. ఇది మునుగోడు ఉప ఎన్నిక కోసం కాదని, శాశ్వతంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నామంటూ చెబుతున్నారు.. అదే నిజమైతే.. ముఖ్యమంత్రితో హామీ ఇప్పించాలని కార్మిక నేతలు కోరారట. మునుగోడు నియోజకవర్గంలో 2,630 ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఉండగా, 8 వేల వరకు ఓట్లున్నట్లు అంచనా..
ఇప్పటికే బూర నర్సయ్య పార్టీ వీడడంతో ఆ ప్రభావం నుంచి గట్టెక్కేలా ఆర్టీసీ కార్మికుల ఓట్లపై గురిపెట్టినట్లు తెలుస్తోంది.. ఇందు కోసం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చడానికి.. ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది..16 శాతం ఐఆర్‌ను కలుపుకుని, కనీసం 30 శాతానికి పైగా పీఆర్సీ, యూనియన్ల పునరుద్ధరణ, కనీసం మూడు డీఏలు విడుదల చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఫైల్ తెప్పించుకున్నట్లు సమాచారం.
దీనికి సంబంధించిన నిధులను రుణాల రూపంలో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నం చేస్తోందట.. అదే జరిగితే ఆర్టీసీ ఓటర్లంతా దిక్కులు చూడకుండా కారెక్కి కాలుమీద కాలేసుకుని కూర్చోరూ.. ఏమో..గుర్రం ఎగరావచ్చు..ఎన్నిక వేళ ఏమైనా జరగొచ్చు..
మరిన్ని మునుగోడు ఉపఎన్నికల వార్తల కోసం
