Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS MP on Modi: విభజన గాయంపై మోడీ కారం.. ప్రధాని వాఖ్యలపై భగ్గుమన్న టీఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో చేసిన కామెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు మోడీ ఇలాంటి కామెంట్ చేశారో లేదో గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి.

TRS MP on Modi: విభజన గాయంపై మోడీ కారం.. ప్రధాని వాఖ్యలపై భగ్గుమన్న టీఆర్ఎస్
Trs Mp
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 09, 2022 | 12:20 PM

TRS MP’s Press Meet: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) రాజ్యసభ(Rajy Sabha)లో చేసిన కామెంట్స్ తెలంగాణ(Telangana) వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు మోడీ ఇలాంటి కామెంట్ చేశారో లేదో గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. అసలు 2004లో తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే.. ఇంత మంది బలయ్యే వారా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణపై మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమంటున్నారు. విభజన గాయంపై మోడీ కారం పూశారా? ప్రధాని ఉద్దేశపూర్వకంగానే ఈ కామెంట్స్ చేశారా? తన మనస్సులోని మాట ఇన్నాళ్లకు బయటపెట్టారా? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారా? ఉద్దేశం ఏదైనా తెలంగాణ వాసులను మరోసారి గాయపరిచింది. దశాబ్దాల తరబడి పోరాడి సాధించికున్న రాష్ట్రంపై ఈ వ్యాఖ్యలు ఏంటని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చాయి.

తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులు. ఊరూరా బీజేపీ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నాయి. నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు ఆ పార్టీ నేతలు. భారీ ఎత్తున బైక్‌ ర్యాలీలు తీస్తున్నారు. తెలంగాణ పోరాటాన్ని అవమానపరిచిన మోడీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు నిరసన గళం వినిపించారు. తెలంగాణ భవన్‎లోని గురజాడ హాల్‎లో టీఆర్ఎస్ ఎంపీల ప్రెస్ మీట్ నిర్వహించారు.

రాజ్యాంగాన్ని, పార్లమెంట్‎ని, పార్లమెంట్ విధులను మంటగలిపే విధంగా ప్రధాని మోడీ మాట్లాడటం శోచనీయమని టీఆర్ఎస్ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు. తెలంగాణ ప్రజల్ని అవమానించేలా మోడీ వ్యాఖ్యానించారని కేకే మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల విభజన అన్‎సైంటిఫిక్‎గా జరిగిందని మోడీ ఏడేళ్ల తర్వాత అంటున్నారని ఆయన అన్నారు. అసలు అన్‎సైంటిఫిక్ అంటే ఏంటో మోడీ చెప్పాలని కేకే డిమాండ్ చేశారు. పార్లమెంట్ పద్ధతుల గురించి తెలిసినవారు ఎవరూ కూడా ఇలా మాట్లాడరు. పార్లమెంట్లో జరిగే దేనినీ కోర్టు కూడా ప్రశ్నించడానికి వీలుండదన్నారు. పార్లమెంట్‎లో శాస్త్రీయం, ఆశాస్త్రీయం అంటూ ఏమీ ఉండదు. మెజారిటీ ఉందా లేదా అనేది చూసి బిల్లు పాసు చేస్తుంటారని కేకే స్పష్టం చేశారు. సభలో గలాటా జరిగితే, అప్పుడు ఏం చేయాలన్న విషయంపై కూడా రూల్ బుక్ ఉందన్నారు.

తెలంగాణ బిల్లు సమయంలో బీజేపీ కూడా మద్ధతు తెలిపిందని గుర్తు చేసిన కేకే.. ఆ విషయం మరచిపోవద్దన్నారు. బిల్లు సమయంలో ఆంధ్రా ఎంపీలు నిజంగానే బాగా గొడవ చేశారు. అయితే, రూల్ బుక్ నిబంధనల మేరకే సభాపతి వ్యవహరించారన్నారు. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన తర్వాత ఆశాస్త్రీయం అంటే అర్థం ఏంటి? పెప్పర్ స్ప్రే చల్లడం వంటివి జరిగాయి కాబట్టే సభాపతి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మెజారిటీ విషయంలో ఎవరైనా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తే, లాబీ క్లియర్ చేసి.. ఓటింగ్ నిర్వహిస్తారన్నారు. కౌంటింగ్ నిర్వహించడం సాధ్యపడని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలన్నది కూడా రూల్ బుక్‎లో ఉందన్నారు. పూర్తి శాస్త్రీయంగా తెలంగాణ బిల్లు పాసయింది. నిజానికి ఇప్పుడు బిల్లులను పాస్ చేస్తున్న తీరు ఆశాస్త్రీయం. ప్రస్తావన, నోటీస్, చర్చ ఏదీ లేకుండా బుల్ డోజ్ చేస్తూ బిల్లులు పాసు చేస్తున్నారని కేకే విమర్శించారు.

పార్లమెంటును, సభాపతులను కించపరిచే విధంగా ప్రధాని మాట్లాడుతున్నారు. ఝార్ఖండ్ బిల్ సమయంలో కూడా కొందరు వాజపేయి మీదకి దూసుకెళ్లిన విషయం మర్చిపోవద్దని కేకే అన్నారు. అడ్డుకునే ప్రయత్నంలో ఆనంద్ మోహన్ అనే సభ్యుడి చేయి విరిగిందన్నారు. పెప్పర్ స్ప్రే ఘటన మినహా తెలంగాణ బిల్లు ప్రక్రియ సాఫీగా జరిగిందన్న కేకే.. పార్లమెంట్ పద్ధతులు తెలియకుండానే ఒక ప్రధాని ఇలా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయ సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని దుయ్యబట్టారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయా.. లేదా.. అన్న అంశంపై న్యాయ సలహా తీసుకుంటాం’ అని కేకే అన్నారు.

ఈ సందర్బంగా లోక్‌సభ టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ చరిత్ర తెలవకపోవడం వల్ల మాట్లాడుతున్నాడో.. ఏందో అర్ధం కావడం లేదన్న నామా.. ప్రధాని మోడీ వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు. 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తెలంగాణ. ఈ పోరాటంకు నా ప్రాణాన్ని ఇస్తామని ముందుకు వచ్చిన నేత సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. 2009లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ప్రాణాలను అడ్డుపెట్టి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు.. ప్రజలు రోడ్డెక్కుతున్నారని ఆనాడు లోక్ సభలో చెప్పామన్నారు.

ఆనాడు బీఏసీ సమావేశంలో అందరి ముందు తెలంగాణ బిల్లు కోసం డిమాండ్ చేశామన్న నామా.. తెలంగాణ అభివృద్ధి ని ఓర్వలేక మాట్లాడిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పడితే అవమానపరిచే విధంగా ప్రధాని మాట్లాడుతున్నారు. గడచిన 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ ముందుకు తీసువచ్చారు.దేశంలో తెలంగాణ నెంబర్ 1 గా నిలుస్తుందని బీజేపీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే గుజరాత్ పరిస్థితి పోయి తెలంగాణ వచ్చిందన్న అక్కసుతో ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన, ఏమి ఇవ్వకున్న అభివృద్ధి లో ముందుకు సాగుతుందని ప్రధాని బాధపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందవద్దు, తెలంగాణ రైతులు, బిడ్డలు ముందుకు సాగవద్దని ప్రధాని కోరుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు భారత దేశ ప్రజలు కారా? అని నామా ప్రశ్నించారు. ప్రతిసారి తెలంగాణ ప్రస్తావన వచ్చినప్పుడు ఈర్ష్య కనబడుతోంది. పార్లమెంట్‌లో ఏ బిల్లునైనా పాస్ చేసే క్రమంలోనైన డోర్లు మూసేస్తారని నామా గుర్తు చేశారు. పార్లమెంట్ ను దేశ ప్రజల దేవాలయం అంటారు. పార్లమెంట్ ను కించపరచే విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి జరగవద్దనే ఈ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనించాలి. అందరం ఏకమై ఈ కుట్రలను తిప్పికొట్టాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు అండగా నిలబడాలని కోరుతున్నామని నామ నాగేశ్వర రావు పేర్కొన్నారు.