Ex MLA Bikshamaiah Goud: తెలంగాణ(Telangana)పై ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ(BJP).. ఆపరేషన్ ఆకర్ష్(Operation Akash) వేగం పెంచింది. ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు.. సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నవారు.. ఇలా అందరినీ కలుపుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేత, ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో భిక్షమయ్యగౌడ్ కషాయం కండువా కప్పుకున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు.. ఇంకా చాలామంది ఇతర పార్టీల నేతలు బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు.
ఇక, కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన భిక్షమయ్య గౌడ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా పనిచేశారు.. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు.. అయితే, 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఆలేరులో టీఆర్ఎస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నా.. అంతగా పార్టీ ప్రాధాన్యత లభించకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. టీఆర్ఎస్‌లో సరైన గుర్తింపు లేకపోవడం.. నామినేటెడ్ పోస్టులు ఆశించినా.. నిరాశే ఎదురుకావడంతో.. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
Read Also… Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన అడవి పంది.. ప్రాణ భయంతో చిరుత పరుగో పరుగు..!