Nallala Odelu joined Congress: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ౠయ సతీమణి జడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లాల ఓదెలు దంపతులకు గురువారం ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజలు, రాష్ట్ర అభ్యున్నతికి ఇటీవల తన పర్యటనలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని, సోనియా గాంధీ నాయకత్వాన్ని విశ్వసించి నల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని..టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ నాయకత్వంలోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఆశతో ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చారని తెలిపారు. కేసీఆర్ కారణంగా తెలంగాణలో మాదిగలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని రేవంత్ ఈ సందర్భంగా విమర్శించారు. సోనియాకు తెలంగాణ ప్రజలంతా బాసటగా నిలబడి సంపూర్ణ సహకారంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నల్లాల ఓదెలుకి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఓదేలు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలబడుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదన్నారు. బాల్క సుమన్‌కు టికెట్ ఇచ్చి తనను పక్కన పెట్టారని పేర్కొన్నారు. తనకు టికెట్ రాలేదని ఓ కార్యకర్త ఆత్మహత్య సైతం చేసుకున్నాడన్నారు. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలిచాక తమపై బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. తన భార్య భాగ్యలక్ష్మిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నప్పటికీ ప్రోటోకాల్ ఇవ్వలేదని.. ఎలాంటి అధికారాలు లేవన్నారు. ఇందుకే.. తాను, తన భార్య, పిల్లలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. అలాగే తన భార్య జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవికి కూడా రాజీనామా చేసిందని పేర్కొన్నారు. గౌరవం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరామని.. ఓదేలు స్పష్టంచేశారు. ఎన్నోసార్లు కేటీఆర్‌తో తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేశాను, కానీ స్పందించలేదంటూ ఓదేలు పేర్కొన్నారు.