
గత అనుభవాల దృష్ట్యా వచ్చే విపత్తును కాంగ్రెస్ ముందుగానే ఊహించింది. ఆ విపత్తును ఎదుర్కునేందుకు టీ కాంగ్రెస్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. టీ కాంగ్రెస్‌కు అభ్యర్థుల ఎంపిక ఒక సవాల్ అయితే, క్యాండిడేట్స్ ప్రకటన తర్వాత వచ్చే పెను తుఫాన్ అతిపెద్ద ప్రమాదంగా మారే సూచనలు ఉన్నాయి. అందుకే ఆ విపత్తు నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ దారులు వెతుక్కుంటుంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత జరిగే పరిణామాలకు మెడిసిన్ వేసే బాధ్యతను సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ జానారెడ్డికి అప్పగించింది.. జానారెడ్డితో పాటు ఏఐసీసీ ఇంఛార్జి ఠాక్రే, ఎన్నికల పరిశీలకులు దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌కు ఈ బాధ్యత అప్పగించారు. 20 కి పైగా నియోజకవర్గాల్లో టిక్కెట్ కోసం ద్విముఖ, త్రిముఖ పోటీ ఉంది. ఇందులో ఏ ఒక్కరికి టిక్కెట్ ఇచ్చినా మిగతా వారు రెబల్స్‌గా మారే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఎన్నికల్లో టీ కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పోటీ ఎక్కువ ఉన్న నియోజకవర్గ నేతలతో మాట్లాడే బాధ్యతను జానారెడ్డి కమిటీకి అప్పగించారు.
గాంధీ భవన్‌లో భేటీ అయిన జానారెడ్డి కమిటీ టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీపై తిరుగుబాటు చేసే నేతల జాబితా సిద్ధం చేసింది. వారందరిని ఏ విధంగా బుజ్జగించాలి.. ఎవరెవరికి ఏ నేత చెప్తారనే దానిపై కమిటీ వర్కవుట్ చేసింది. పరిస్థితిని బట్టి టిక్కెట్‌ల ప్రకటన తర్వాత బుజ్జగింపుల కోసం ఏఐసీసీ నేతలను రంగంలోకి దింపనుంది జానారెడ్డి కమిటీ.. టీ కాంగ్రెస్‌లో ఎవరికైనా నచ్చజెప్పే సామర్థ్యం ఉన్న నేతగా, పెద్థ మనిషిగా టీ కాంగ్రెస్‌లో జానారెడ్డికి పేరుంది. ఆయన మాటను ఎవ్వరూ గట్టిగా కాదనలేరు. ఆయన వయస్సుకు, అనుభవానికి గౌరవం ఇస్తారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి కాంగ్రెస్‌కు చాలాకాలంగా పెద్దదిక్కుగా ఉన్నారు. అందుకే ఏరి కోరి జానారెడ్డికి ఏఐసీసీ ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం.. అయితే టిక్కెట్ ఆశించే నేతల మధ్య సయోధ్య కుదర్చడమే జానారెడ్డి ప్రధాన లక్ష్యం. జానారెడ్డి కమిటీ ముందు చాలా పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు టికెట్లు రావనే అంచనాతో ఆశవాహులు దేనికైనా రెడీ అంటున్నారు. గాంధీ భవన్‌లో ఓవైపు నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ను గట్టెక్కించే బాద్యత జానారెడ్డి చేతిలోనే ఉందంటున్నారు హస్తం నేతలు. ట్రబుల్ షూటర్‌గా పేరున్న జానారెడ్డి అసంతృప్తులను బుజ్జగించే విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.
Jana Reddy
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..