పెండింగ్‌లో ఉన్న చలాన్లను చెల్లించేందుకు తెలంగాణలోని వాహన దారులకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి వాహనదారుల నుంచి అపూర్వ స్పందన లభించింది. సుమారు నెలన్నరపాటు సాగిన ప్రత్యేక రాయితీ ద్వారా 3 కోట్లకు పైగా చలానాలు క్లియర్ అయ్యాయి. 65 శాతం కార్ల యజమానులు, 70శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు పెండింగ్ చలానాలు కట్టారు. రూ.1700 కోట్ల పెండింగ్ చలానాల్లో భాగంగా ఇప్పటివరకు రూ.1004 కోట్లు వసూలయ్యాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో డిస్కౌంట్ ఆఫర్ తర్వాత రూ.312 కోట్లు వసూలయ్యాయని వారు పేర్కొన్నారు. కాగా గడువు ముగిసినా చాలామంది చలానాలు చెల్లించలేదని, సుమారు 30 శాతం మంది చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో పెండింగ్ చలానాలు ఉన్న వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించేందుకు రెడీ అయ్యామని సీపీ పేర్కొన్నారు. ‘ రాయితీ ముగిసిన తర్వాత కూడా ఇంకా 30 శాతం మంది వాహనదారులు చలానాలు చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి పెండింగ్ చలానాలు క్లియర్ చేసేందుకు రెడీ అవుతున్నాం. ఎవరైతే చలానాలు చెల్లించకుండా రోడ్లపై తిరుగుతారో వారిపై కేసులు నమోదు చేస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని రంగనాథ్ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: