
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో భువనగిరి ఎంపీ టికెట్ హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి కుటుంబం మరోసారి భువనగిరి టికెట్‌ను ఆశిస్తుందా..? ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారా..? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. అలాగే భువనగిరి ఎంపీ టికెట్ కోమటిరెడ్డి లక్ష్మికే ఇవ్వాలని పార్టీ కేడర్ సైతం కోరుకుంటుందట. భువనగిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని ప్రకటించింది. ఇక భువనగిరి స్థానం అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతోంది కాంగ్రెస్ అధినాయకత్వం.
కాంగ్రెస్ పార్టీలో ఇపుడు భువనగిరి ఎంపీ టికెట్ కోసం చాలా మంది ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టికెట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్న బీఆర్ఎస్ నేతలు గుత్తా అమిత్ రెడ్డి, ఫైళ్ల శేఖర్ రెడ్డి, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌లు ఆశలు పెట్టుకున్నారట. దీంతో భువనగిరి ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు సూర్య పవన్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారట.
అయితే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి మాత్రం టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. భువనగిరి ఎంపీ టికెట్ సతీమణి లక్ష్మికి కావాలని రాజగోపాల్ రెడ్డి తొలుత ఆశించారట. కానీ రాష్ట్ర క్యాబినెట్ బెర్త్ కోసం రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి లక్ష్మీకి భువనగిరి ఎంపీ టికెట్ విషయం వెనుకడుగు వేసినట్లు సమాచారం. అయితే తాజాగా పార్టీ క్యాడర్ మాత్రం లక్ష్మీకి ఎంపీ టికెట్ కోరుకుంటున్నారట. మరోవైపు భారతీయ జనతా పార్టీ బీసీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ ను బరిలో నిలిపింది. దీంతో కాంగ్రెస్ టికెట్ కూడా బీసీకే ఇస్తే బాగుంటుందని రాజగోపాల్ రెడ్డి పార్టీకి సూచించారట.
భువనగిరి కాంగ్రెస్ టికెట్ కోసం ఇతర పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. అవసరమైతే గోడదూకేందుకు సిద్ధమవుతున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ మాత్రం కోమటిరెడ్డి లక్ష్మీకే టికెట్ ఇవ్వాలని కోరుతోందట. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గంపై కోమటిరెడ్డి బ్రదర్స్ కు మొదటి నుంచి గట్టి పట్టు ఉంది. 2009 ఎన్నికల్లో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 2014లో ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించారు. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గంలో ఏడు అసెంబ్లీలకు గానూ జనగామ మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఈ పార్లమెంటు సెగ్మెంట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రత్యేక అనుచరగణం ఉంది.
ఇక రాజగోపాల్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతూనే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోని జనగామ నియోజకవర్గంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట రాజగోపాల్ రెడ్డి అత్యాధునాతన వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత నిధులతో పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల అభివృద్ధికి కృషి చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజల మనసు గెలుచుకుని ప్రజలకు మరింత దగ్గరయ్యారు.
భువనగిరి లోక్ సభ నియోజక వర్గ అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ మాత్రం కోమటిరెడ్డి లక్ష్మీకే టికెట్ ఇవ్వాలని కోరుతోందట. కోమటిరెడ్డి లక్ష్మీని బరిలోకి దించితే పార్టీ గెలుపు నల్లేరు మీద నడికే అవుతుందని క్యాడర్ భావిస్తుందట. మొత్తం మీద లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ టికెట్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…