Weather Report: రాష్ట్ర వాసులకు వర్ష సూచన.. నేడు, రేపు వడగండ్ల వానలు!

|

Mar 21, 2025 | 8:08 AM

మార్చి నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఎండల ధాటికి జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది..

Weather Report: రాష్ట్ర వాసులకు వర్ష సూచన.. నేడు, రేపు వడగండ్ల వానలు!
Telangana Weather Report
Follow us on

హైదరాబాద్, మార్చి 21: గత పది రోజులుగా బానుడి ప్రతాపం రాష్ట్ర ప్రజలను హడలెత్తించింది. ఉదయం నుంచే ఎండ తీక్షణంగా కాస్తుండటంతో ఇళ్ల నుంచి జనాలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అయితే తాజాగా వాతావరణ కేంద్రం రాష్ట్ర వాసులకు చల్లని కబురు చెప్పింది. ఎండల నుంచి ఉపశమనం కలగనున్నట్లు వెల్లడించింది. మధ్య ఒరిస్సా నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి బలహీనపడినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు (శుక్ర, శని) తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

దీంతో ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రాగల రెండు రోజులు తెలంగాణ లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని, ఎండ తీవ్రత తగ్గి జనాలకు కాస్త ఉపశమనం కలుగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఆ తరువాత మాత్రం ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ రోజు (మార్చి 21) గరిష్టంగా మెదక్‌లో 39.6, కనిష్టంగా హనుమకొండ లో 34.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

గురువారం (మార్చి 20) తెలంగాణ లోని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మహబూబ్ నగర్ లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మెదక్..40.1, నిజామాబాద్..40.1, ఆదిలాబాద్..39.3, భద్రాచలం..38, మహబూబ్ నగర్..38, హైదరాబాద్..37.6, ఖమ్మం..37.6, నల్లగొండ..35.5, రామగుండం..35.4, హనుమకొండ..35 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.