Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తొమ్మిదేళ్లు కాపురం చేశారు.. కట్ చేస్తే..సినిమాను మించిన ట్విస్ట్‌..

| Edited By: Velpula Bharath Rao

Nov 14, 2024 | 12:19 AM

దాంపత్య బంధానికి రోజురోజుకు విలువ లేకుండా పోతోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ఏకంగా భర్తనే హత్య చేయించింది ఓ భార్య. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఓ హత్యకేసును ఛేదించిన పోలీసులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. 

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తొమ్మిదేళ్లు కాపురం చేశారు.. కట్ చేస్తే..సినిమాను మించిన ట్విస్ట్‌..
The Wife Killed Her Husband With Her Girl Friend In Nagarkurnool
Follow us on

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని మహాత్మాగాంధీకాలనీ తండాలో వ్యవసాయ పొలం వద్ద రాత్లావాత్ రాజు నాయక్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు . తలపై బలమైన గాయం చేసి రాజు నాయక్‌ను కిరాతకంగా హత్య చేశారు. తండ్రి వర్ష్యా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య హిమబిందు భర్త రాజునాయక్‌ను కిరాతకంగా హత్య చేయించింది.

వెల్దండ మండలం మహాత్మాగాంధీకాలనీ తండాకు చెందిన రాత్లావాత్ రాజు నాయక్ అదే తండాకు చెందిన హిమబిందును తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. గతేడాది వరకు వీరి సంసారం ఎంతో అన్యోన్యంగా సాగింది. వీరికి ఒక బాబు, పాప సంతానం ఉన్నారు. పచ్చని వీరి సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కళ్లెంచెరువు తండాకు చెందిన చంటి మహాత్మాగాంధీ కాలనీ తండాలోని మేనమామ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో చంటికి హిమబిందు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. ఏడాది కాలంగా ఈ తతంగం నడిపిస్తుండగా విషయం భర్త రాజునాయక్‌కు తెలిసింది. దీంతో భార్య హిమబిందు, చంటిలను రాజు నాయక్ తీవ్రంగా మందలించాడు.

అడ్డు తొలగించేందుకు హత్యకు ప్లాన్:

తమ వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్త రాజునాయక్‌ను చంపాలని పథకం రచించారు. ఈ నెల 7వ తేదీన అడవి పందుల నుంచి వేరుశనగ పంటకు కాపాలా ఉండేందుకు రాజునాయక్‌ అక్కడే నిద్రించాడు. ఇదే అదనుగా భావించిన భార్య హిమబిందు హత్య ప్లాన్‌ను ప్రియుడు చంటికి తెలిపింది. దీంతో చంటి అదేరోజు సాయంత్రం మహేశ్వరంలో సుత్తె కొనుగోలు చేసి మిత్రుడు రాకేశ్‌ను సహాయంగా తీసుకువచ్చాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత చంటి, రాకేశ్, హిమబిందు కలిసి రాజు నాయక్ తలపై పలుమార్లు సుత్తితో బలంగా కొట్టి హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా రాజు నాయక్ మృతదేహాన్ని కొంత దూరంలో పడేశారు. ఆధారాలు లభించకుండా మంచానికి అంటిన రక్తపు మరకలను సైతం నీటితో శుభ్రం చేశారు. అనంతరం ఘటనాస్థలి నుంచి నిందితులు చంటి, రాకేశ్ పరారయ్యారు. తెల్లవారేసరికి ఏమి తెలియనట్లు భర్త రాజు నాయక్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని భార్య హిమబిందు కన్నీళ్లు పెట్టుకుంది. మృతుడు రాజునాయక్ తండ్రి వర్ష్యా ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. తొలుత భార్య హిమబిందు తరచూ చంటితో ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకొని ఆమె పోలీసులు విచారించగా నేరం ఒప్పుకుంది. మృతుడి భార్య హిమబిందుతో పాటు చంటి, రాకేశ్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి