
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో విషాదం మధ్య ప్రజాస్వామ్య ఘట్టం చోటుచేసుకుంది. శంకర్‌పల్లి మండలం మాసానిగూడ గ్రామ పంచాయతీ 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన పల్లె లత (42) ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పల్లె లత ఇటీవలే నామినేషన్ దాఖలు చేసి, డిసెంబర్ ఏడోవ తేదీన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారం మధ్యలో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆమె గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబసభ్యులు, మద్దతుదారులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభ్యర్థి మృతితో గ్రామంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది.
అయినప్పటికీ నిబంధనల ప్రకారం కొనసాగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పల్లె లతకే ప్రజలు తమ మద్దతు ప్రకటించారు. ఆదివారం (డిసెంబర్ 14) జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఆమె తన సమీప ప్రత్యర్థిపై 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అభ్యర్థి మరణించినప్పటికీ ప్రజలు చూపిన మద్దతు చర్చనీయాంశంగా మారింది.
పల్లె లత విజయవార్త గ్రామంలో భావోద్వేగాలకు గురి చేసింది. ఒకవైపు ఆమె మృతి పట్ల తీవ్ర విచారం, మరోవైపు ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవంగా మారింది. ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్థులు భావోద్వేగానికి లోనవుతుండగా, ఈ ఘటన ప్రజాస్వామ్యంలో అరుదైన సంఘటనగా నిలిచిందంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..