ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ఎవరికైనా సరే జరిమానా తప్పదు. ప్రజల భద్రతే లక్ష్యంగా మన పోలీసు యంత్రాంగం వాహన చట్టాలు, రోడ్డు భద్రతా నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా బైక్ పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇద్దరి కంటే ఎక్కువ మంది బైక్‌పై ప్రయాణించరాదు. సిగ్నళ్ల వద్ద జంప్ చేయరాదు. ర్యాష్ డ్రైవింగ్ చేయరాదు. అలాగే, కారులో ప్రయాణించే వారు డ్రైవర్ సహా పక్కనున్న వారు కూడా సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. లేదంటే, అధికారులు వేసే ఫైన్ కట్టక తప్పదు. అందరికీ తెలిసిన ఈ పాత ముచ్చట్లు ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా..? అయితే సీటు బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్ కు ఫైన్ వేశారు ట్రాఫిక్ సిబ్బంది. ఈ విచిత్రమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ ట్రాక్టర్ డ్రైవరుకు సీటు బెల్ట్ పెట్టుకోలేదని 100 రూపాయలు ఫైన్ వేశారు పాల్వంచ పోలీసులు. పాల్వంచ మండలం జగన్నాథ పురం కు చెందిన నాగిరెడ్డి ట్రాక్టర్ లో ఇసుక తీసుకు వస్తుండగా ఫైన్ వేశారు పోలీసులు. మార్చి 27 న పోలీసులు ఫైన్ వేయగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ నాగిరెడ్డి షాక్ అయ్యాడు. అతనే కాదు.. విషయం తెలిసిన చుట్టుపక్కల జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ట్రాక్టరుకు అసలు సీట్ బెల్ట్ ఎక్కడిదని ట్రాక్టర్ యజమాని వాపోతున్నాడు. ఈ విషయం గురించి తెలుసుకోవాలని షోరూమ్ కి కూడా ఫోన్ చేసామని.. అయితే ట్రాక్టర్ కు సీటు బెల్ట్ అనేదే ఉండదని చెప్పారని ట్రాక్టర్ డ్రైవర్ తెలిపారు.
గతంలోనూ మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి విచిత్ర సంఘటనే జరిగింది. ఒక ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇలాంటి చలాన్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా సీతానాగారం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ ధరించలేదని చలానా విధించినట్లు మెసేజ్ వచ్చింది. అది చూసిన బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే ట్రాఫిక్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..