Siddipet District: ఓ బుజ్జి తల్లి… పుట్టుకతోనే ఎన్ని కష్టాలమ్మా నీకు

| Edited By: Ram Naramaneni

Nov 13, 2024 | 9:46 PM

మంచితనం విషయం అటుంచితే.. అమ్మతనం కూడా ప్రస్తుతం కరువు కావడం ఆందోళన కలిగించే విషయం. ముద్దులొలుకుతూ అమ్మ పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన చిన్నారి.. ముళ్లపొదల్లో బిగ్గరగా ఏడుస్తూ కనిపించింది.

Siddipet District: ఓ బుజ్జి తల్లి... పుట్టుకతోనే ఎన్ని కష్టాలమ్మా నీకు
New Born Baby
Follow us on

ఓ తల్లి కన్నపేగును వదిలించుకుంది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసింది..అన్ని చోట్ల ఉండలేక… దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అందరూ చెబుతారు.. అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే..అలాంటి మాతృ హృదయం కూడా కలుషితమై పోతుంది..బండరాయిలా మారిపోతుంది. కన్న పేగు ప్రేమను కాదనుకుని అప్పుడే పుట్టిన ఆడశిశువును చెట్ల పోదల్లో వదిలి వేసిన అమాన‌వీయ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో చోటు చేసుకుంది.

దుద్దెడ గ్రామ శివారులో చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. విషయం తెలుసుకున్న దుద్దెడ మాజీ సర్పంచ్ మహాదేవ్, స్థానికులు 108కి సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కొండపాక 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ మల్లేష్ హుటాహుటిన ఘటన ప్రాంతానికి వెళ్లి పాపను అంబులెన్సులోకి తరలించి ప్రథమ చికిత్స చేశారు.
ఆ వెంటనే మెడికల్ టెక్నీషియన్ ‘108’ కాల్ సెంటర్‌లో ఉన్న డాక్టర్ దుర్గాప్రసాద్‌కి సమాచారం అందించి, అతడి సలహాలు, సూచనలు పాటిస్తూ పాపను జాగ్రత్తగా  సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాపం ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కొన్ని రోజుల ఆస్పత్రిలోనే ఉంచి.. ఆ తర్వాత సంరక్షణ కోసం సఖి కేంద్రానికి తరలిస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.