TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో వెయ్యికిపైగా కొత్త బస్సులు.. ఎక్కడెక్కడంటే..?
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వెయ్యికిపైగా బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది. వీటి రాకతో బస్సుల్లో రద్దీ భారీగా తగ్గనుంది. దీని వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం చేసే వెసులుబాటు లభిస్తోందని అధికారులు చెబుతున్నారు.

టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో కొత్తగా 1085 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రద్దీ తగ్గి కూర్చోని ప్రయాణించడానికి సీట్లు లభించనున్నాయి. దీని వల్ల ఇబ్బంది పడకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ కొత్త బస్సులు అందుబాటులోకి రానుండగా.. అనంతరం వివిధ రూట్లలో తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. దీని వల్ల కూర్చోవడానికి సీట్లు దొరకడం లేదు. భారీగా ప్రవేశపెట్టనున్న ఈ కొత్త బస్సులతో రద్దీ కాస్త తగ్గే అవకాశముందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఏసీ, నాన్ ఏసీ బస్సులు
ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ నుంచి 1085 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు టీజీఎస్‌ఆర్టీసీ సిద్దమైంది. ఈ మేరకు ఆ సంస్థకు లెటర్ ఆప్ ఇంటెంట్ ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. పీఎంఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఈవీ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 12 మీటర్ల పొడవు ఉన్న లో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను ఓలెక్ట్రా సంస్థ ఆర్టీసీకి పంపిణీ చేయనుంది. వీటిల్లో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులతో పాటు నాన్ ఏసీ బస్సులు కూడా ఉండనున్నాయి. స్థానిక రోడ్లకు అనుకూలంగా సౌకర్యవంతమైన ప్రయాణం అందించేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఈ బస్సులకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 45 నిమిషాలు పడుతుంది. ఇక ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఫీచర్లు ఇవే..
ఇక ఈ బస్సులో ముందు, వెనుక భాగంలో అత్యాధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థ ఉంటుంది. ఇక వీల్ చైర్ ప్రయాణికుల కోసం ప్రత్యేక స్థలం ఉంటుంది. ఇక ఆధునిక హంగులతో ఈ బస్సులను తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. కాగా దేశవ్యాప్తంగా 3600 ఎలక్ట్రిక్ బస్సులను ఓలెక్ట్రా సంస్థ ఇప్పటికే సరఫరా చేసింది. ఇక ప్రస్తుతం 10 వేల బస్సులను డెలివరీ చేసేందుకు ఆర్డర్ పొందింది. వీటిల్లో తెలంగాణ ఆర్టీసీకి వెయ్యికిపైగా బస్సులను అందించేందుకు సిద్దమవుతోంది. త్వరలోనే ఈ బస్సులు తెలంగాణ ఆర్టీసీ చేతికి అందనున్నాయి. ఈ బస్సుల్లో చాలావాటిని హైదరాబాద్‌లోని రద్దీ రూట్లో తిప్పనున్నారు. దీని వల్ల హైదరాబాద్ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. రానున్న కొన్నేళ్లల్లో పర్యావరణాన్ని రక్షించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద మొత్తంలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
