Weather Report: మండే ఎండల్లో చల్లని కబురు.. తెలుగురాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన!
తెలుగురాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. వర్షాల సమయంలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే రాబోయే రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని స్పష్టం చేసింది.

గురువారం మరాత్వాడ ప్రాంతం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణాంతర్గత కర్నాటక వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు మరాత్వాడ ప్రాంతం నుండి కర్ణాటక తీరప్రాంతం వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రాభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో శుక్రవారం ,శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో కొనసాగి తదుపరి నాలుగు రోజులలో సాధారణ స్థాయి నుండి క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో రాబోయే మూడు రోజుల వాతావరణం
ఇక అటు ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ, నైరుతి దిశగా వీస్తున్న గాలుల ఫతిలంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30-40 కిలీమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఇక శుక్రవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణము నెలకునే అవకాశముంది తెలిపింది.
అయితే, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో పెద్దగా మార్పులు లేవని, ఆ తరువాత 3 రోజుల్లో 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులోనూ పెద్దగా మార్పులు ఏమి ఉండవని స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
