Ticket Scam 2026 : రూ.500 టికెట్ రూ.35 వేలు.. బ్లాక్ మార్కెట్ ముఠా గుట్టురట్టు.. మాజీ క్రికెటర్ అరెస్ట్
Ticket Scam 2026 : టీ20 వరల్డ్ కప్ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాలో ముంబై మాజీ అండర్-19 క్రికెటర్ బలవంత్ సింగ్ సోధా అరెస్ట్ అయ్యారు. భారత్, శ్రీలంక వేదికగా జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Ticket Scam 2026 : ఐపీఎల్ 2026 సందడి మొదలవక ముందే క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. రేపు (మార్చి 28న) బెంగళూరులో జరగబోయే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అయితే ఈ టికెట్ల అమ్మకాల నేపథ్యంలో ముంబై పోలీసులు ఒక భారీ టికెట్ బ్లాక్ మార్కెట్ ముఠాను పట్టుకున్నారు. కానీ, ఈ అరెస్టులు ఐపీఎల్ టికెట్లకు సంబంధించి కాదు, ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ టికెట్ల బాగోతానికి సంబంధించినవి. ఈ కేసులో ఒక మాజీ క్రికెటర్, ఒక కోచ్ అరెస్ట్ కావడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వరల్డ్ కప్ సెమీఫైనల్ టికెట్ల బాగోతం
భారత్, శ్రీలంక వేదికగా జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ టికెట్ల విషయంలో భారీ అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ మ్యాచ్ చూసేందుకు ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని, కొందరు టికెట్లను భారీ ధరలకు బ్లాక్‌లో విక్రయించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, టికెట్లను అక్రమంగా అమ్ముతున్న నెట్‌వర్క్‌ను ఛేదించారు.
అరెస్ట్ అయిన మాజీ క్రికెటర్ ఎవరు?
ఈ స్కామ్‌లో ముంబై అండర్-19 జట్టుకు గతంలో ప్రాతినిధ్యం వహించిన 26 ఏళ్ల బలవంత్ సింగ్ సోధా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బలవంత్ సింగ్‌కు క్రికెట్ సర్కిల్స్‌లో ఉన్న పరిచయాలను వాడుకుని టికెట్లు సేకరించేవాడని పోలీసులు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌లో అతడే కీలక సూత్రధారి అని, టికెట్లను తన అనుచరులకు ఇచ్చి అధిక ధరలకు విక్రయించేలా చేసేవాడని తేలింది. ఒకప్పుడు మైదానంలో మెరిసిన ఆటగాడు ఇలా టికెట్ల దందాలో పట్టుబడటం అందరినీ విస్మయానికి గురిచేసింది.
రూ. 35 వేలకు ఒక్కో టికెట్
నివేదికల ప్రకారం, సెమీఫైనల్ మ్యాచ్ టికెట్లను నిందితులు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు విక్రయించారు. అసలు ధర కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ వసూలు చేసి సామాన్య క్రికెట్ అభిమానులను దోచుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక కాలేజీ స్పోర్ట్స్ టీచర్, ఒక నాన్-టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఈ దందాను నడిపించారు.
పాస్‌ల దుర్వినియోగం?
ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సభ్యులకు లేదా విశిష్ట అతిథులకు ఇచ్చే కాంప్లిమెంటరీ పాస్‌లను వీరు దొడ్డిదారిన సంపాదించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పాస్‌లను, కొన్ని ఆన్‌లైన్ టికెట్లను సేకరించి, అత్యవసరంగా టికెట్లు కావాల్సిన వారికి సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయ్యి అమ్మేవారు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఇలాంటి పెద్ద స్కామ్ బయటపడటంతో, స్టేడియాల వద్ద భద్రతను, టికెట్ల తనిఖీని పోలీసులు మరింత కఠినతరం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
