AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మేం సామాన్యులం కాదు.. క్యూలో నిలబడలేం’.. వీఐపీ టిక్కెట్ల కోసం ఎమ్మెల్యేల డిమాండ్

బెంగళూరులో ఐపీఎల్ 2026 సందడి మొదలవ్వకముందే కర్ణాటక అసెంబ్లీలో టిక్కెట్ల రచ్చ మొదలైంది. తమకు ఉచితంగా వీఐపీ టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్ చేసిన డిమాండ్ ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో క్రికెట్ టిక్కెట్ల కోసం పట్టుబట్టడంపై ఎంపీ తేజస్వి సూర్యతో పాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మేం సామాన్యులం కాదు.. క్యూలో నిలబడలేం’.. వీఐపీ టిక్కెట్ల కోసం ఎమ్మెల్యేల డిమాండ్
Karnataka Congress Mla Demands Free Ipl Tickets
Venkata Chari
|

Updated on: Mar 27, 2026 | 1:41 PM

Share

హుంగుండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కాశప్పనవర్ అసెంబ్లీ వేదికగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) పై విరుచుకుపడ్డారు. తాము ప్రజాప్రతినిధులమని, తమకు తగిన గౌరవం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. “మేము సామాన్యులలా క్యూలో నిలబడి టిక్కెట్లు తీసుకోలేము. ప్రతి ఎమ్మెల్యేకు కనీసం 5 వీఐపీ టిక్కెట్లు ఇవ్వాలి. గతంలో మమ్మల్ని సాధారణ గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేఎస్సీఏ ప్రభుత్వం నుంచి భద్రతతో పాటు అన్ని సౌకర్యాలను పొందుతుందని, కానీ, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో మాత్రం వెనకాడుతోందని ఆయన ఆరోపించారు. ఆన్‌లైన్ టిక్కెట్ల అమ్మకం అంతా ఒక నాటకమని, అక్కడ బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందని గంభీరమైన ఆరోపణలు చేశారు. ఈ డిమాండ్‌కు ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ కూడా మద్దతు పలకడం గమనార్హం.

తేజస్వి సూర్య ఘాటు విమర్శలు..

ఎమ్మెల్యేల వీఐపీ టిక్కెట్ల డిమాండ్‌ను బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన పవిత్రమైన సభలో ఐపీఎల్ టిక్కెట్ల కోసం కొట్లాడటం అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించడమేనని ఆయన మండిపడ్డారు. “సామాన్యులు కష్టపడి సంపాదించిన డబ్బుతో టిక్కెట్లు కొంటుంటే, ఎమ్మెల్యేలకు మాత్రం ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఇది వారి అహంకారానికి పరాకాష్ట” అని సూర్య ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ స్పందన, స్పీకర్ ఆదేశాలు..

ఈ వివాదంపై ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ స్పందిస్తూ ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవస్థలో భాగమని, వారు టిక్కెట్లు అడగడంలో తప్పులేదని ఆయన సమర్థించుకున్నారు. దీనిపై కేఎస్సీఏ పదాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ యు.టి. ఖాదర్ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలకు విఐపి టిక్కెట్లు అందేలా కేఎస్సీఏకు తగిన సూచనలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ప్రజాప్రతినిధుల ఈ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో కరువు, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నప్పుడు టిక్కెట్ల కోసం పాకులాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us