AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్సీబీ అమ్మకంతో చేతులు మారిన రూ. 16,600 కోట్లు.. విజయ్ మల్యా వాటా ఎంత?

RCB Sold: ఐపీఎల్ అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇటీవల రికార్డు స్థాయి ధర పలికింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును రూ. 16,600 కోట్లకు కొనుగోలు చేయడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ భారీ డీల్ ద్వారా జట్టు మాజీ యజమాని విజయ్ మల్యాకు ఎంత లాభం చేకూరిందనే అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆర్సీబీ అమ్మకంతో చేతులు మారిన రూ. 16,600 కోట్లు.. విజయ్ మల్యా వాటా ఎంత?
Rcb Team Sale Vijay Mallya Earns
Venkata Chari
|

Updated on: Mar 27, 2026 | 1:50 PM

Share

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు విజయ్ మల్యా తన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ద్వారా ఆర్సీబీ జట్టును కేవలం రూ. 446 కోట్లకు కొనుగోలు చేశారు. తన లిక్కర్ బ్రాండ్ ప్రచారానికి క్రికెట్ ను వేదికగా చేసుకోవాలనే ఆయన వ్యూహం అప్పట్లో విమర్శలకు దారితీసినప్పటికీ వ్యాపార పరంగా అది గొప్ప విజయమని నిరూపితమైంది. కేవలం రెండు దశాబ్దాలలోపే జట్టు విలువ వేల కోట్లకు చేరడం విశేషం.

మల్యాకు వాటా ఎందుకు దక్కలేదు?

ప్రస్తుత అమ్మకం ద్వారా విజయ్ మల్యాకు ఒక్క రూపాయి కూడా దక్కకపోవడం గమనార్హం. దీనికి కారణం ఆయనకు జట్టులో ఎలాంటి షేర్లు మిగిలి లేకపోవడమే. 2012లో బ్రిటీష్ కంపెనీ ‘డియాజియో’ మల్యాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ లో 53.4 శాతం వాటాను రూ. 11,166 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలోనే మల్యాకు సుమారు రూ. 3,635 కోట్లు అందాయి.

2013-14 కాలంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభంలో పడటంతో మల్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆ తర్వాత డియాజియో తన వాటాను 56 శాతానికి పెంచుకుంది. ఆ సమయంలో మల్యాను ఛైర్మన్ పదవి నుంచి తొలగించినందుకు అదనంగా రూ. 515 కోట్లు చెల్లించారు. 2016లో మల్యా లండన్ కు పారిపోయే సమయానికి ఆర్సీబీ విలువ రూ. 1,200 కోట్లుగా లెక్కగట్టి డియాజియో పూర్తి యాజమాన్య హక్కులను తన వశం చేసుకుంది.

లాభం ఎవరికి చేరింది?

2026లో జరిగిన ఈ తాజా డీల్ ద్వారా వచ్చిన రూ. 16,600 కోట్లు నేరుగా ప్రస్తుతం యాజమాన్య హక్కులు కలిగి ఉన్న యూఎస్ఎల్ (డియాజియో) ఖాతాలోకి వెళ్తాయి. విజయ్ మల్యా ఈ అమ్మకంపై లండన్ నుంచి ట్వీట్ చేసినప్పటికీ ఆర్థికంగా ఆయనకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. ఒకప్పుడు తక్కువ ధరకు కొన్న జట్టు నేడు వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదగడం ఐపీఎల్ బ్రాండ్ పవర్‌ను చాటిచెబుతోంది. బీసీసీఐ అధికారిక ఆమోదం లభించిన తర్వాత ఆర్సీబీ పూర్తిస్థాయిలో ఆదిత్య బిర్లా గ్రూప్ సొంతం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us