Indira Shoban: ఆరంభంలోనే పడుతున్న వికెట్లు.. షర్మిల శిబిరం నుంచి దూరం అవుతున్న నేతలు.. YSRTPకి ఇందిరాశోభన్‌ గుడ్‌బై

Indira Shoban: ఆరంభంలోనే పడుతున్న వికెట్లు.. షర్మిల శిబిరం నుంచి దూరం అవుతున్న నేతలు.. YSRTPకి ఇందిరాశోభన్‌ గుడ్‌బై
Indira Shoban

వైఎస్‌ఆర్‌టీపీలో ముసలం మొదలైంది. ఒకరి తర్వాత మరొక నేత షర్మిల శిబిరం నుంచి దూరమవుతున్నారు. తాజాగా YSR తెలంగాణ పార్టీకి ఇందిరాశోభన్‌ రాజీనామా చేశారు.

Balaraju Goud

|

Aug 20, 2021 | 4:48 PM

Indira Shoban resigns to YSRTP: వైఎస్‌ఆర్‌టీపీలో ముసలం మొదలైంది. ఒకరి తర్వాత మరొక నేత షర్మిల శిబిరం నుంచి దూరమవుతున్నారు. సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోతున్నారు. తాజాగా YSR తెలంగాణ పార్టీకి ఇందిరాశోభన్‌ రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

వైఎస్ పాలన తెలంగాణలో తీసుకురావాలన్న లక్ష్యంతో పార్టీ పెట్టి జననానికి దగ్గరవ్వాలని వైఎస్ షర్మిల ప్రయత్నిస్తున్నారు. వరుస సమావేశాలతో పాటు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. లీడర్‌కి కేడర్‌కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. సందర్భం చేసుకుని మరీ టీఆర్‌ఎస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. నిరుద్యోగ దీక్షలతో ఇప్పుడిప్పుడే రాజకీయంగా హీట్ పెంచుతున్నారు. ప్రభుత్వం గానీ, విపక్షాలు గానీ పట్టించుకోని పీల్డ్ ఆసిస్టెంట్లకు సంఘీభావం తెలిపి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌టీపీలో కల్లోలం మొదలైంది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన ఇందిరా శోభన్ వీడుతున్నట్లు ప్రకటించారు.

ఇందిరాపార్క్ దగ్గర షర్మిల మొదటిసారి నిరుద్యోగ దీక్ష చేసిన సమయంలో స్టేజీ మీద ఇందిరాపై చేసిన కామెంట్లు అప్పట్లో దుమారం రేపాయి. ఆ తర్వాత పార్టీ ఆవిర్భావ సభలో వేదికపై నుంచే తన ఫోన్‌ పోయిందని.. అది తిరిగి ఇవ్వాలని అడిగారు. దానిపైనా షర్మిల చివాట్లు పెట్టారని తెలుస్తోంది. వరుస అవమానాలు తట్టుకోలేకే ఇందిరా పార్టీ వీడారన్న ప్రచారం నడుస్తోంది. ఇంతకుముందు కేటిరెడ్డి ఇప్పుడు ఇందిరా శోభన్‌లు వైఎస్‌ఆర్‌టీపీ నుంచి దూరమయ్యారు. ఆరంభంలోనే వికెట్ల మీద వికెట్లు పడితే.. పార్టీ ముందుకెళా వెళ్తుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో రచ్చ చేస్తోంది. కొత్త పార్టీలో చేరికలు ఉండాలి. కానీ విచిత్రంగా ఉన్న వాళ్లే పోతున్న పరిస్థితి నెలకొంది.

షర్మిలక్కకు తోడు ఇందిరక్క సోపతి మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఏమో చేద్దామనుకుంటే ఇంకేమో అయింది. దూరపు కొండలు నునుపు అని బ్రమపడి అసలు కాంగ్రెస్‌ను కాదని వలస కాంగ్రెస్‌లోకి వలస వచ్చింది. కొన్నాళ్లకే పచ్చిపులుసు కంటే పలసనైంది. మరోవైపు, తెలంగాణ కాంగ్రేస్‌కు రేవంత్ పీసీసీ బాధ్యతలు చేపట్టగానే, పార్టీ వీడిన కార్యకర్తలు.. రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొట్టి కొత్త అధినేత వైపు తిరిగి పరుగులు పెడుతున్నారు. సొంత పార్టీ వెలిగి పోతుంటే పక్కపార్టీలో నలిగిపోతూ కొనసాగడం ఇష్టంలేక.. ఇన్నేండ్లు కష్ట కాలంల కూడా పార్టీకి అండగా ఉన్నదాన్ని అట్లనే ఉండకుంటా పొయ్యిపొయ్యి పొయిల పడ్డట్టు షర్మిలక్క ఆంధ్ర పార్టీల పడ్తి అని బెంగటీలిన ఇందిరక్క. భయానికే భయం పుట్టేలా నిర్ణయం తీసుకుంది.

ఇందిరాశోభన్. . ప్రజల స్వేచ్ఛ కోసం కొట్లాడే నేను స్వేచ్ఛ లేని వలస పార్టీల ఉండుడేంది. నాకు కొండంత అండ నా కాంగ్రేస్ పార్టీ.. పుట్టెడు బలగం నా పార్టీ లీడర్లు, క్యాడర్లు.. ఇంత బలగం కాదని చింతకింద గింతంత పార్టీని పట్టుకొని చింతించుడేందని రాజీనామా లేఖ రాసి చిన్నమాటల తల్లి షర్మిలమ్మకు ముట్టుజెప్పింది. కొంగు నడుంకు చుట్టి, తలపాగా కట్టి కొదమసింగం లెక్క బయటకొచ్చింది. లేటుగానైనా తెలంగాణ ఆడబిడ్డనని గుర్తుకు తెచ్చుకుందని ఆంధ్ర పార్టీల చేరుడు ఇష్టంలేని అభిమానులు. ఇలా ఒక్కొక్కరు పార్టీ వీడుతుండటంతో మరి షర్మిల ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తారన్నది వేచిచూడాలి.

Read Also… PM Modi:ఉగ్రవాదులకు రాజ్యాన్ని పాలించే హక్కు లేదు.. తాలిబన్లపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu