AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫ్లెక్సీలు లేవు.. సోషల్ మీడియా పోస్ట్‌లు లేవు.. ప్లాస్టిక్‌పై వార్డు మెంబర్ వినూత్న పోరాటం!

ప్లాస్టిక్‌.. చూస్తే చిన్న వస్తువే.. కానీ పర్యావరణానికి మాత్రం పెను ముప్పు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రజల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ గ్రామ వార్డు సభ్యుడు వినూత్నంగా ఆలోచించారు. ఫ్లెక్సీలు కాదు.. మైకులు కాదు.. సోషల్‌ మీడియా పోస్టులు అంతకంటే కాదు.. అతడు చేసిన వినూత్న ప్రయత్నమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ఫ్లెక్సీలు లేవు.. సోషల్ మీడియా పోస్ట్‌లు లేవు.. ప్లాస్టిక్‌పై వార్డు మెంబర్ వినూత్న పోరాటం!
Ward Member's Unique Letter Campaign For Change
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 16, 2026 | 11:42 AM

Share

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెం గ్రామ వార్డు సభ్యుడిగా పాతం వెంకటేష్ వ్యవహరిస్తున్నారు. అంకిరెడ్డిగూడెంను అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని వెంకటేష్‌ భావించాడు. ముఖ్యంగా గ్రామాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆయన ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. సాధారణంగా ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్యానర్లు పెడతారు.. కరపత్రాలు పంచుతారు.. ర్యాలీలు నిర్వహిస్తారు. కానీ వెంకటేష్‌ మాత్రం మరో అడుగు ముందుకేశారు. పరిశుభ్రమైన అంకిరెడ్డిగూడెం కోసం ఒక చిన్న మనవి” అంటూ వెంకటేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకరం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ను విస్మరిద్దాం అంటూ గ్రామస్తులకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. ఒక్కో ఇంటి తలుపు తట్టి చెప్పడం ఒక మార్గమైతే.. ప్రతి కుటుంబం ఆ లేఖను చదివి, ఆలోచించేలా చేయాలన్న ఉద్దేశంతో పోస్టల్‌ శాఖను ఆశ్రయించారు.

320 ఇళ్లకు.. సొంత ఖర్చులతో..

గ్రామంలోని ప్రతి కుటుంబానికీ ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలను వివరించాలను కున్న వెంకటేష్‌.. 320 ఇళ్లకు పోస్టల్‌ శాఖ ద్వారా తన సొంత ఖర్చులతో లేఖలు పంపించారు. మన ఇంటి నుంచి మార్పు మొదలైతేనే.. మన గ్రామం మారుతుంది” అన్న ఆలోచనతో ప్రతి కుటుంబానికి వ్యక్తిగతంగా లేఖ పంపించారు. “బట్ట సంచులనే వాడండి.. మన గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చుకుందాం” అంటూ విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్‌ సంచుల స్థానంలో బట్ట సంచులను వినియోగించి.. గ్రామంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని లేఖల ద్వారా వెంకటేష్ కోరారు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించడంతో పాటు.. భవిష్యత్‌ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని గుర్తుచేశారు.

ప్రచారం కాదు.. మార్పు కోసం..

ఒక చిన్న లేఖ అయినా.. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్‌ వినియోగంపై చర్చ మొదలవుతుందన్న ఆశతో ఈ కార్యక్రమాన్ని చేపట్టానని వెంకటేష్ చెబుతున్నాడు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన, ప్లాస్టిక్‌ రహిత వాతావరణాన్ని అందించాలంటే గ్రామంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వెంకటేష్ పిలుపునిస్తున్నాడు.

అయితే ప్రచారానికి వేల రూపాయలు ఖర్చు చేయడం కంటే.. ప్రజల్లో అవగాహన కోసం సొంత డబ్బుతో లేఖలు రాయడం మాత్రం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్లాస్టిక్‌ సంచికి బదులు ఓ బట్ట సంచి ఎంచుకోవడం.. చెత్తను రోడ్డుపై వేయకుండా డస్ట్‌బిన్‌లో వేయడం.. అంతే! మన ఊరు.. మన పరిసరాలు.. మన భవిష్యత్‌.. అన్నీ మారిపోతాయి. అంకిరెడ్డి గూడెంలో మొదలైన ఈ “లేఖల పోరాటం” ప్లాస్టిక్‌పై ప్రజల్లో ఎంతటి మార్పు తీసుకొస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us