Telangana Weather Report: తెలంగాణలో నిన్నటి తీవ్ర అల్పపీడనం బలహీనపడి దూరంగా వెళ్లిపోయింది. ఈ రోజు షియర్ జోన్ 20° N లాటిట్యూడ్ వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి మీ నుంచి 5.8 కి మీ మధ్య కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. ఈ రోజు కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఒకటి, రెండు ప్రదేశాలలో మోస్తారు వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెల 11వ తేదీన ఉత్తర & మధ్య బంగాళాఖాతం దగ్గరలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
అయితే 11 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు ఈ రెండు రోజులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు సైతం నిండు కుండలా కళకళలాడుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను దిగువకు వదులుతున్నారు.
కాగా గత రెండు రోజులుగా వరంగల్‌లో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నడికుడలో 14.5, సంగెంలో 14.4 సెం.మీ, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్‌లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలో బొగత జలపాతం కనువిందు చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాద జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది.