తెలంగాణలో మరో రెండు భారీ ఎత్తిపోతలకు ప్రణాళికలు.. నారాయణఖేడ్, జహీరాబాద్‌లకు కాళేశ్వరం జలాలు..!

గోదావరి జలాలతో తెలంగాణ పొలాలు ఇక సస్యశ్యామలం కావాలన్న ధృఢ సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

తెలంగాణలో మరో రెండు భారీ ఎత్తిపోతలకు ప్రణాళికలు.. నారాయణఖేడ్, జహీరాబాద్‌లకు కాళేశ్వరం జలాలు..!
Follow us
Balaraju Goud

| Edited By: Anil kumar poka

Updated on: Feb 22, 2021 | 12:02 PM

lift irrigation projects on Singur : గోదావరి జలాలతో తెలంగాణ పొలాలు ఇక సస్యశ్యామలం కావాలన్న ధృఢ సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణకు మార్గం సుగమమం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో సాగునీరు అందని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు రిజర్వాయర్‌కు నీటి లభ్యతను పెంచేలా పనులు వేగవంతమయ్యాయి. దీని కొనసాగింపుగా సింగూరు నీటిని ఆధారం చేసుకొని రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు సిద్దమవుతన్నట్లు సమాచారం. పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో సుమారు 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఈ రెండు పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇరిగేషన్‌ శాఖ సిద్ధమవుతోంది.

ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సింగూరుకు నీటి లభ్యత పెంచేలా కాళేశ్వరంలోని మల్లన్నసాగర్‌ నుంచి నీటిని తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులు పూర్తయితే సింగూరుకు నీటి కొరత తీరనుంది. సింగూరుకు నీటిపై ఆధారపడి.. సాగునీటి వసతి కరువైన ప్రాంతాలకు గోదావరి జలాలను ఎత్తిపోసేలా రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారాయణఖేడ్‌ ప్రాంతానికి నీరందించేలా బసవేశ్వర ఎత్తిపోతలకు, జహీరాబాద్‌ నియోజకవర్గానికి నీరందించేలా సంగమేశ్వర ఎత్తిపోతలకు ప్రాణం పోస్తోంది.

సింగూరులో 510 లెవల్‌ నుంచి సుమారు 8 టీఎంసీల నీటిని తీసుకుంటూ నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లందించేలా దీన్ని రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం 55 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసేలా ఒకటే లిఫ్టును ప్రతిపాదిస్తుండగా, ఈ ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.700– 800 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వస్తున్నారు. ఇక, జహీరాబాద్‌ నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సింగూరులో 510 లెవల్‌ నుంచి రెండు దశల్లో 125 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసిందుకు ఫ్లాన్ చేస్తున్నారు. తద్వరా 15 టీఎంసీల మేర నీటి అవసరాలకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి దాదాపు రూ.1,300 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు నీటి పారుదల శాఖ అధికారులు.

మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటిని తీసుకునేందుకు… అంచనా వ్యయం రూ.2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. అయితే, ఈ స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ అవసరాలతో పాటు కెనాల్‌ అలైన్‌మెంట్, పంప్‌హౌస్‌ల నిర్మాణ ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. అనంతరం విద్యుత్‌ అవసరాలు, నిర్మాణ వ్యయాలపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు డీపీఆర్‌ సిధ్దం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

Read Also…. రైతులకు గుడ్‏న్యూస్ అందించిన కేంద్రం.. వారి అకౌంట్లలోకి మళ్లీ రూ.2వేలు.. ఎప్పటినుంచో తెలుసా..