
తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులు లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి. రాబోయే వానాకాలం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలం సీజన్ మొదలైన క్రమంలో తక్షణమే నిధులు విడుదల చేయాలని వ్యవసాయ, ఆర్ధికశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు 1.50 కోట్ల ఎకరాలకు రూ.6 వేల చొప్పున అందించేందుకు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిధులను వ్యవసాయశాఖకు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 18వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.
కేబినెట్ఆమోదం అనంతరం నిధులు విడుదల ప్రాసెస్ ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. విడతల వారీగా లబ్దిదారులకు నిధులు బదిలీ చేయనున్నారు. జూన్ 26వ తేదీన ఎకరంలోపు పోలంకు సంబంధించిన నిధులు విడుదల చేస్తారు. తొలిరోజు మొత్తం 73 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. ఆ తర్వాత మిగిలిన రైతులకు విడతల వారీగా అందించనున్నారు. ఎక్కువ పోలం ఉన్నవారికి విడతల వారీగా జమ చేయనున్నారు. నేరుగా వీటిని బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. సన్న బియ్యం పండించేవారికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. ఇకపై 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. రైతు వేదికలు కేవలం సమావేశాలకే పరిమితం కాకూడదని, ఆ వేదికలు రైతుల కోసం సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ వేదికల వద్ద వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లు చూసుకోవాలని రేవంత్ తెలిపారు. సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ ఇస్తోందది. దీంతో దానికి అనుగుణంగా 7 రకాల సన్న వడ్ల విత్తనాలను ప్రభుత్వం రైతులకు అందించేందుకు సిద్దం చేసింది. ఇక విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోళ్ల వరకు ప్రతీ విషయంలో ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పంట వేసిన దగ్గర నుంచే పంట రికార్డులు, రైతుల వివరాలు, దిగుబడి అంచనాలు, డిజిటల్ ల్యాండ్ మ్యాపింగ్, ధాన్యం కొనుగోళ్లు వంటి సమాచారం మొత్తం వ్యవసాయ శాఖ దగ్గర ఉండాలన్నారు.